సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 01:26:03

సీఎం కేసీఆర్‌కు ప్రధాని ప్రశంస

సీఎం కేసీఆర్‌కు ప్రధాని ప్రశంస

  • పేదలకు ప్రకటించిన సాయాన్ని వివరించిన ఎంపీ నామా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేపడుతున్న చర్యలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. సోమవారం లోక్‌సభ నిరవధికంగా వాయిదాపడిన అనంతరం స్పీకర్‌ ఓంబిర్లా చాంబర్‌కు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, అన్ని పార్టీల లోక్‌సభాపక్ష నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి, జనతా కర్ఫ్యూ చర్చకు వచ్చినప్పుడు లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలంగాణలో తెల్లరేషన్‌కార్డు కుటుంబాలకు రూ.1500, ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం చొప్పున దాదాపుగా రూ.3 వేలకోట్ల ప్యాకేజీని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని వివరించారు. ఈ నెల 31 వరకు రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ నిర్వహిస్తున్నందున 90 లక్షల కుటుంబాలకుసాయం అందుతుందని నామా తెలిపారు. 

సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. జనతా కర్ఫ్యూ పిలుపుపై ప్రజలు స్పందించిన తీరును లోక్‌సభలోని అన్ని పక్షాల నేతలతో ప్రధాని పంచుకున్నారు. ఒక వృద్ధురాలు ఖాళీ ప్లాస్టిక్‌ డబ్బాను గోడకుకొట్టి కర్ఫ్యూకు సంఘీభావాన్ని తాను మీడియాలో చూసినట్టు ప్రధాని తెలిపారు. అమెరికా, ఇటలీ వంటి దేశాలు కరోనాతో ఇబ్బంది పడుతున్నాయని, మనం అప్రమత్తం కావాలనే ఉద్దేశంతో జనతా కర్ఫ్యూ సహా అనేక నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రధాని తెలిపారు.


logo