సోమవారం 13 జూలై 2020
Telangana - Feb 07, 2020 , 02:29:57

తెలంగాణపై విషం కక్కిన మోదీ

తెలంగాణపై విషం కక్కిన మోదీ
  • తలుపులు మూసి, చర్చలేకుండా రాష్ట్రం ఇచ్చారని రాజ్యసభలో వ్యాఖ్యలు
  • మండిపడుతున్న తెలంగాణవాదులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విషంకక్కారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై వ్యతిరేకతను బయటపెట్టారు. రాష్ట్ర ప్రజలను అవమానించేలా గతంలో లోక్‌సభలో మాట్లాడిన మోదీ.. గురువారం రాజ్యసభలో మరోసారి విషం చిమ్మారు. ‘2014లో తలుపులు మూసేసి, టెలివిజన్‌ ప్రసారాలను నిలిపివేసి చర్చ జరపకుండా సభా కార్యక్రమాల్ని నిర్వహించారు’ అంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానపరుస్తూ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసేలా మాట్లాడారు. అరవై ఏండ్ల కలను, తెలంగాణ పోరాటాన్ని అవమానపరిచేలా ప్రధాని మాట్లాడటంపై తెలంగాణవాదులు, మేధావులు మండిపడుతున్నారు. 


రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా సభలో జరిగిన పరిణామాలు, సభానిర్వహణ, అధికారపక్షం వ్యవహరించిన తీరును అగౌరవపరిచేలా మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. చట్టసభలను అవమానించేలా వ్యాఖ్యలుండటం సమంజసంకాదని హితవు పలుకుతున్నారు. పూర్తిస్థాయిలో చర్చలు జరిపి, ఆంధ్ర, తెలంగాణ ప్రజాప్రతినిధుల్ని సంప్రదించి సర్వామోదంతో రాష్ర్టాన్ని ఏర్పాటుచేసి ఉండాల్సిందని మోదీ పేర్కొనడం సరికాదంటున్నారు. అప్పట్లో ప్రత్యేక తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతిచ్చిన విషయాన్ని మోదీ ఎలా మర్చిపోయి మాట్లాడతారని అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆజాద్‌ గురించి వ్యాఖ్యానించిన మోదీ.. 2014లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అరుణ్‌ జైట్లీ, లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్న సుష్మాస్వరాజ్‌ తెలంగాణకు మద్దతు తెలిపిన విషయం మర్చిపోతే ఎలాఅని ప్రశ్నిస్తున్నారు. 


‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఏం జరిగిందో దేశ ప్రజలింకా మరిచిపోలేదు’ అని మోదీ అనడం సమంజసం కాదంటున్నారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా సభలో కొనసాగిన నిరసనల వల్ల ప్రజాస్వామ్యానికే విఘాతం కలుగుతున్నదని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారని వ్యాఖ్యానించిన మోదీ.. బీజేపీ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతు తెలిపిన విషయాన్ని ఎలా మరుస్తారని ఆగ్రహించారు. తెలంగాణ ఆరుదశాబ్దాల ప్రజాకాంక్షని.. దాన్ని అడుగడుగునా ఆంధ్రా నాయకత్వం అడ్డుకున్నదని, పార్లమెంటులో పెప్పర్‌ స్ప్రేతో ఎంపీలపై దాడిచేసిన ఘటన గుర్తులేదా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. మోదీ వ్యాఖ్యల్ని గమనిస్తే ఆయనకు తెలంగాణపై ఆవగింజంత ప్రేమ కూడా లేదని అర్థమవుతుందని అంటున్నారు. బీజేపీ అధికారంలో ఉంటే.. వందేండ్లయినా తెలంగాణ వచ్చేది కాదంటున్నారు. 


ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన మంత్రులు, ఉద్యోగ సంఘాలు


తెలంగాణ ఏర్పాటుపై ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తీవ్రంగా ఖండించారు. మోదీ అవివేకంగా, అవగాహన లేకుండా మాట్లాడారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఆ మాటలు తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న అమరవీరులను అవమానించడమేనన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, కేసీఆర్‌ పోరాటాన్ని, ప్రజల ఆకాంక్షను ప్రపంచమే గుర్తించిందని, ఇవేవీ మోదీకి తెలియకపోవడం దురదృష్టకరమని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మోదీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. మోదీ తెలంగాణ ఏర్పాటుపై విషంకక్కడం దారుణమని తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ అన్నారు. 


తెలంగాణ విభజన చీకట్లో జరిగిందని చెప్పిన బీజేపీ.. తెలంగాణలో ఎందుకు సంబురాలు జరుపుకొన్నదని ప్రశ్నించారు. మోదీ వ్యాఖ్యలతో ఉద్యమకారుల మనోభావాలు  దెబ్బతినేలా ఉన్నాయని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ పేర్కొన్నది. పార్లమెంట్‌ వేదికగా రాష్ర్టాన్ని అవమానించేలా ప్రధాని మాట్లాడటం ఉద్యోగుల, ఉద్యమకారుల మనోభావాలు దెబ్బతీశాయని ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్‌ కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ మమత, కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, ఏనుగుల సత్యనారాయణ పేర్కొన్నారు.


logo