గురువారం 09 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 00:39:47

రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

  •  సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసిన కోవింద్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ర్టావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఫోన్‌చేసి అభినందించారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగువేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతికి సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా రాష్ట్రపతి ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ..‘తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం! యావత్‌ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగువారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్తు దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ట్విట్టర్‌ ద్వారా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రతిభ చాటుతున్న తెలంగాణవాసులు: ప్రధాని

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. దేశ ప్రగతిలో తెలంగాణ ముఖ్య భూమిక పోషిస్తున్నదని తెలిపారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతి, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

హృదయపూర్వక ధన్యవాదాలు: సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి తదితర ప్రముఖులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఆకాంక్షించినందుకు రాష్ట్ర ప్రజల తరపున, వ్యక్తిగతంగా నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని సీఎం పేర్కొన్నారు.

కొత్త శిఖరాలను అధిరోహించాలి: అమిత్‌షా

రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.  ట్విట్టర్‌ ద్వారా ఆయన తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జనహృదయ నేత కేసీఆర్‌: సినీనటుడు చిరంజీవి

‘ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసిన జనహృదయ నేత సీఎం కేసీఆర్‌కు, యావత్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ట్వీట్‌ చేశారు.


logo