శుక్రవారం 29 మే 2020
Telangana - Feb 20, 2020 , 15:33:40

ఇప్పటి సర్పంచ్‌లు అదృష్టవంతులు: మంత్రి సత్యవతి రాథోడ్‌

ఇప్పటి సర్పంచ్‌లు అదృష్టవంతులు: మంత్రి సత్యవతి రాథోడ్‌

ములుగు : ఇప్పుడున్న సర్పంచ్‌లు అదృష్టవంతులని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన కల్పించేందుకు ములుగు జిల్లా లీలా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్‌ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ...   అప్పటి సర్పంచులకు అరకొర నిధులు వచ్చేవన్నారు. అవి తాగునీటి అవసరాల కోసం కూడా చాలేవి కాదన్నారు. కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే ధర్నాలు జరిగేవన్నారు. కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నిధుల సమస్య లేదన్నారు. మిషన్‌ భగీరథ కింద తాగునీరు, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నారన్నారు. ఊరి పారిశుద్ధ్యం కోసం ట్రాక్టర్లు ఇస్తున్నారన్నారు. పల్లెల్లో ఇప్పుడు మంచి ప్రగతి కనిపిస్తోంది. ఆర్థిక మాంద్యం ఉన్నా పల్లె ప్రగతికి సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నెలకు రూ.338 కోట్లు క్రమం తప్పకుండా ఇస్తున్నారన్నారు. కలెక్టర్‌ దగ్గర ఉన్న నిధులు కూడా బాగా పనిచేసిన వారికి ఇవ్వాలని నిర్ణయించారన్నారు. కాబట్టి ఇప్పుడున్న సర్పంచ్‌లు పోటీపడి పనిచేసి పల్లె ప్రగతి చేపట్టాలని పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి విజయవంతానికి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, అధికారులు పల్లె నిద్ర చేయనున్నట్లు తెలిపారు. సర్పంచ్‌లుగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. క్రమంగా అడవులు కనుమరుగు అవుతున్నాయని హరితహారంలో భాగంగా ములుగు జిల్లా వాసులు అడవిని కాపాడే బాధ్యత తీసుకోవాలని కోరారు. రాజకీయాలు ఎన్నికలప్పుడు మాత్రమేనని తర్వాత అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌, ఏటూరు నాగారం పి.వో. హనుమంతు, డీఎఫ్‌వో ప్రవీణ్‌శెట్టి, జడ్పీ సీఈవో పారిజాతం, ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. logo