ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 01:13:44

ప్రాజెక్టులకు నిధులిచ్చేందుకు సిద్ధం

ప్రాజెక్టులకు నిధులిచ్చేందుకు సిద్ధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ ఇబ్రహీంపట్నం: తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నాబార్డు చైర్మన్‌ చింతల గోవిందరాజులు తెలిపారు. ప్రాజెక్టులకు అన్నిరకాల అనుమతులు, డిజైనింగ్‌ ఉండి.. నిధులు అవసరమని కోరితే వారం రోజుల్లో ఇవ్వడానికి తగిన ఏర్పాట్లుచేస్తామని చెప్పారు. శుక్రవారం మంత్రి సబితారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో రూ.2 కోట్లతో నిర్మించనున్న సహకారసంఘం గోడౌన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో కాళేశ్వరం, మల్లన్నసాగర్‌ తదితర ప్రాజెక్టుల ద్వారా రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయాలన్న సీఎం కేసీఆర్‌ కలలు కలలు నిజమయ్యాయన్నారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన ధాన్యంపై రుణ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. 

మార్కెట్‌ కేంద్రంగానే వ్యవసాయం చేయాలి

మార్కెట్‌ కేంద్రంగానే వ్యవసాయం సాగాలని, వినియోగదారుల అవసరాల మేరకే పంటలు పండించాలని అప్పుడే లాభసాటిగా మారుతుందని నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు అన్నారు.  రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్‌పీవో)లకు రుణాలిచ్చేందుకు త్వరలో ‘రుణ పూచీకత్తు నిధి’ని ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. శుక్రవారం నాబార్డ్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడేండ్లలో 10వేల ఎఫ్‌పీవోల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. తెలంగాణలో రూ.900 కోట్లతో చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నామన్నారు. 

టెస్కాబ్‌ పనితీరు బాగుంది: నాబార్డ్‌ చైర్మన్‌

తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్‌ ఏపెక్స్‌ బ్యాంకు (టెస్కాబ్‌) పనితీరు బాగున్నదని నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు ప్రశంసించారు. శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి బ్యాంకును సందర్శించిన ఆయన పలు విషయాలపై చర్చించారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను, వ్యవస్థ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను టెస్కాబ్‌ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు, ఎండీ మురళీధర్‌ నాబార్డ్‌ చైర్మన్‌కు వివరించారు. పీఏసీఎస్‌ల కంప్యూటరైజేషన్‌ కోసం నాబార్డ్‌ గ్రాంట్‌ను అందించాలని  కోరారు. టెస్కాబ్‌ ఏర్పడిన ఐదేండ్లలోనే రెండుసార్లు దేశంలోనే ఉత్తమ బ్యాంకు అవార్డును గెలుచుకున్నదని వివరించారు.


logo