సోమవారం 25 మే 2020
Telangana - Apr 09, 2020 , 01:40:30

1500 బెడ్ల దవాఖాన సిద్ధం

1500 బెడ్ల దవాఖాన సిద్ధం

  • గచ్చిబౌలిలో 15 రోజుల్లోనే ఏర్పాటు
  • 22 ప్రైవేట్‌ దవాఖానల్లో 15,040 బెడ్లు
  • ప్రతిరోజూ 900 మందికి పరీక్షలు
  • నిరంతరం పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్‌
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలమేరకు దేశంలో ఎక్కడా లేనివిధంగా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో 15 రోజుల వ్యవధిలో 1500 బెడ్లతో దవాఖానను సిద్ధంచేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. బుధవారం కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసులకు గాంధీ దవాఖానలోనే చికిత్సచేస్తామని స్పష్టంచేశారు. వైద్య పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినవారిని జిల్లాల్లోనే క్వారంటైన్‌లో ఉంచుతామని చెప్పారు. కరోనా చికిత్స అందించడానికి 22 ప్రైవేట్‌ దవాఖానలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వీటిలో 15,040 బెడ్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.

కరోనా కట్టడి చర్యలపై సీఎం కేసీఆర్‌ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వశాఖలవారీగా రోజూ 18 గంటలపాటు సమీక్షలు కొనసాగుతున్నాయన్నారు. సీఎస్‌ స్థాయిలో ఐఏఎస్‌ అధికారుల కమిటీలతోపాటు తన ఆధ్వర్యంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఈ విషయంలో కీలకంగా పనిచేస్తున్నాదని పేర్కొన్నారు.  పీపీఈలు, ఎన్‌-96 మాస్క్‌లు, గ్లౌజ్‌లు, మందులు.. టెస్టింగ్‌ కిట్లు అధికసంఖ్యలో అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆయా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి తెప్పిస్తున్నారన్నారు. 5 లక్షల పీపీఈ కిట్లు, 5 లక్షల ఎన్‌-95 మాస్క్‌లు, 2 కోట్ల డాక్టర్‌ మాస్క్‌లు, కోటి గ్లౌజ్‌లు, 5 లక్షల గాగుల్స్‌, 3.5 లక్షల టెస్టింగ్‌ కిట్లు త్వరలో రానున్నట్లు మంత్రి వెల్లడించారు.రూ.400 కోట్ల వ్యయంతో మందులు కొంటున్నామని చెప్పారు.  డిల్లీ మర్కజ్‌ నుంచి రాష్ర్టానికి 1,100 మందికి పైగా వచ్చారని మంత్రి ఈటల తెలిపారు. 

మర్కజ్‌నుంచి వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయిన 3,158 మందిని క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచామని, వారిని పరీక్షించి నెగెటివ్‌ వచ్చినవారిని 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచుతామని తెలిపారు.  వాళ్లంతా ఏప్రిల్‌ 21 వరకు ఇండ్లలోనే ఉండాలని స్పష్టంచేశారు. వారిపై వైద్య, పోలీసు సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని, రోజుకు రెండుసార్లు వైద్యసిబ్బంది వెళ్లి పరీక్షిస్తారన్నారు.  మర్కజ్‌ కేసులు తగ్గినప్పటికీ పరిస్థితిని తేలిగ్గా తీసుకోవద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు వెల్లడించారు. చికిత్స పొందుతున్నవారిలో ఎవరి పరిస్థితీ విషమంగా లేదని తెలిపారు. వారిలో కొందరికి పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌ వచ్చినవారిని డిశ్చార్జ్‌ చేస్తామని మంత్రి ఈటల పేర్కొన్నారు. 


logo