ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 01:38:45

విశ్వ విపణికి మన మిర్చి

విశ్వ విపణికి మన మిర్చి

  • మానుకోట మిరపతో నూనెతయారీ 
  • క్యాన్సర్‌ మెడిసిన్‌లో వినియోగం
  • విదేశాల్లో ఈ నూనెకు భారీ డిమాండ్‌
  • సిద్ధమవుతున్న చిల్లీ ఆయిల్‌ యూనిట్‌  

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ: ఘాటైన మానుకోట మిర్చికి అంతర్జాయతీయ ఖ్యాతి దక్కనున్నది. ఇక్కడ పండించిన తేజ రకం మిర్చి నుంచి నూనె తయారుచేయనున్నారు. ఈ నూనె క్సాన్సర్‌ మెడిసిన్‌, పెయిన్‌బామ్‌ తయారీలో వినియోగిస్తారు. కిలో మిర్చి నుంచి దాదాపు 80 మిల్లీలీటర్ల నూనె వస్తుంది. దీనికి అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్నది. జిల్లాలోని కురవి మండలం కాంపెల్లి గ్రామశివారులో ఓ ప్రైవేటు కంపెనీ చిల్లీ ఆయిల్‌ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తవగా, త్వరలోనే ప్రారంభించనున్నారు.  దీంతో ఇక్కడ సాగైన మిర్చి పంటను స్థానికంగానే కొనుగోలు చేయనున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిశ్రమ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మానుకోటలో పండించే మిర్చికి భారీ డిమాండ్‌ ఏర్పడనున్నది. జిల్లాలో ఎర్రనేలలు ఎక్కువ. నేలస్వభావం కారణంగా ఇక్కడ పండే మిర్చికి ఘాటుతోపాటు కారం ఎక్కువ. 


విదేశాలకు ఎగుమతి

తొలుత ఎండు మిర్చి తొడిమలు తీసి, గింజలను వేరుచేస్తారు. తర్వాత మిర్చిని యంత్రాల్లో వేసి నూనె తీస్తారు. ఈ నూనెను వంటల్లో ఉపయోగించే జామ్స్‌ తయారీలో, మంట పుట్టించేందుకు పెయిన్‌బామ్స్‌లో, క్యాన్సర్‌ సంబంధిత మెడిసిన్‌లో వినియోగిస్తారు. కలర్‌ రావడానికి, కాస్మొటిక్స్‌ తయారీలోనూ చిల్లీ ఆయిల్‌ వాడుతారు. మహబూబాబాద్‌ జిల్లాలోని డోర్నకల్‌, బయ్యారం, గార్ల, కురవి, మరిపెడ, మహబూబాబాద్‌, చిన్నగూడురు, నర్సింహులపేట, దం తాలపల్లి, నెల్లికుదురు మండలాల్లో మిర్చిని ఎక్కువగా సాగుచేస్తారు. జిల్లాలో పండే తేజ మిర్చిలో నాణ్యత ఎక్కువగా ఉండటంతోపాటు ఎకరాకు 25 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఖమ్మం జిల్లా ముదిగొండలో చైనాకు చెందిన ఓ సంస్థ చిల్లీ ఆయిల్‌ మిల్లును స్థాపించింది. స్థానిక వ్యాపారులు మహబూబాబాద్‌ జిల్లాలో కొనుగోలు చేసిన మిర్చిని ముదిగొండలోని మిల్లుకు తరలిస్తున్నారు. అక్కడ ఆయిల్‌ తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.  జిల్లాలో పండించిన మిర్చి మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, తమిళనాడుకు సైతం వెళ్తున్నది. ఇక్కడ పండించిన మిర్చి నుంచి తీసిన ఆయిల్‌ను దుబాయ్‌, మలేషియా, అమెరికా తదితర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.

రోజుకు 150 టన్నులు అవసరం 

జిల్లాలో చిల్లీ ఆయిల్‌ యూనిట్‌ ప్రారంభిస్తే రోజుకు 150 టన్నుల మిర్చి అవసరమవుతుం ది. ఈ లెక్కన సంవత్సరానికి 54 వేల టన్నులు కావాల్సి ఉంటుంది. జిల్లాలో గత ఏడాది 36 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగుచేయగా 90 వేల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 40 వేల ఎకరాల్లో సాగవుతుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది లక్ష టన్ను లు రావచ్చని భావిస్తున్నారు. ముదిగొండ యూనిట్‌తోపాటు కొత్తగా కాంపెల్లిలో నెలకొల్పనున్న పరిశ్రమకు ఇక్కడి మిర్చి సరిపోతుందని అధికారులు అంచనావేస్తున్నారు.

మహబూబాబాద్‌ మిర్చికి డిమాండ్‌ 

జిల్లాలోని రైతులు ఎక్కువగా తేజ రకం మిర్చిని సాగుచేస్తారు. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. తేజ మిర్చిలో కారం ఎక్కువ. ఈ మిర్చి ఆయిల్‌ను అనేక అవసరాలకు వినియోగిస్తారు. ఈ ఆయిల్‌కు యూరప్‌ దేశాల్లో డిమాండ్‌ ఉంది. ప్లాంట్‌ లిపిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కాంపెల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న చిల్లీ ఆయిల్‌ యూనిట్‌ వినియోగంలోకి వస్తే రైతులకు మరింత మేలు జరుగుతుంది.

- సూర్యనారాయణ, ఉద్యానశాఖ జిల్లా అధికారి

ధర మంచిగ వొచ్చింది

నేను పదేండ్ల నుంచి మిర్చి ఏస్తున్న. నిరుడు ఎకరంల మిర్చి ఏశిన. 29 క్వింటాళ్ల పంట ఎళ్లింది. ఈ యేడు అదే ఎకరం భూమిల మళ్లా మిర్చి ఏశిన  35 క్వింటాళ్లు వొచ్చింది. క్వింటాలుకు రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు ధర వస్తున్నది. మిర్చి పంటలో మిగులుబాటు ఎక్కువ ఉన్నది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినంక పంటలకు మంచి ధరొస్తుంది. రైతుబంధు వస్తుంది.పెట్టుబడి కోసం ఎవర్నీ పైసలు అడగాల్సిన పనిలేకుండా ఎవుసం చేసుకుంటున్నం. 

-ధరావత్‌ పుల్లు, కేసముద్రం, మహబూబాబాద్‌ జిల్లా

మిర్చి నుంచి ఆయిల్‌ 

మహబూబాబాద్‌లో తేజ మిర్చిని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ మిర్చిని తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌కు ఎగుమతి చేస్తారు. ఇక్కడ పండించే మిర్చిలో ఘాటు అధికంగా ఉంటుంది. దీనిని ఫుడ్‌లో కలర్‌ కోసం వాడుతారు. దీని ఆయిల్‌ను క్యాన్సర్‌ మెడిసిన్‌లో వినియోగిస్తారు.  

-ఎం రాజ్‌కుమార్‌, ఉద్యాన శాస్త్రవేత్త, మహబూబాబాద్‌


logo