మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 03, 2020 , 02:23:35

కళేబరాలతో నూనె, దాణా

కళేబరాలతో నూనె, దాణా
  • అర్ధరాత్రి నుంచి ఐదింటి వరకు తయారీ
  • కొత్తూరు పారిశ్రామికవాడలో పరిశ్రమ సీజ్‌

కొత్తూరు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు పారిశ్రామికవాడలో జంతు కళేబరాలతో నూనె, దాణా తయారుచేస్తున్న పరిశ్రమను అధికారులు సీజ్‌చేశారు. జంతు కళేబరాలు, ఇతర వ్యర్థాలను రవాణా చేసే వాహనాన్ని స్వాధీనం చేసుకున్నా రు. పరిశ్రమలో పనిచేస్తున్న ఏడుగురు కార్మికులను అరెస్టుచేశారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్‌ చౌరస్తాలోని శివాలయం సమీపంలో పాతకేడియా ఆయిల్‌ మిల్‌  గోదాంను ఆరునెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరిప్రసాద్‌, నాగేశ్వర్‌రావు లీజుకు తీసుకున్నారు. హరి ప్రొటీన్‌ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో పరిశ్రమను స్థాపించారు. 20రోజులుగా అర్ధరాత్రి 12 గంట ల నుంచి తెల్లవారుజామున ఐదుగంటల వరకు పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దుర్వాసన ఎక్కడినుంచి వస్తుందనే విషయాన్ని పసికట్టిన గ్రామస్థులు.. పరిశ్రమలోకి వెళ్లి చూడగా జంతు కళేబరాలు కనిపించాయి. వారు సోమవారం అధికారులకు ఫిర్యాదుచేశారు. తాసిల్దార్‌ శేరి వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో జ్యోతి, ఎంపీవో శ్రీనివాస్‌, ఏఎస్సై అబ్దుల్లా పరిశ్రమకు చేరుకొని వివరాలు సేకరించారు. కల్తీ నూనెలు, దాణా తయారవుతున్న ఆ పరిశ్రమను సీజ్‌చేశారు. పరిశ్రమ నిర్వాహకులు, లేబర్‌ కాంట్రాక్టర్‌ పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జంతు కళేబరాలు, చికెన్‌ వ్యర్థాలు సేకరించి..

విజయవాడ, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ని కబేళాల నుంచి జంతు కళేబరాలు, చికెన్‌ సెంటర్లలోని వ్యర్థాలను సేకరించి పరిశ్రమకు తీసుకొస్తారు. వ్యర్థాలను రోలింగ్‌ మెషిన్‌లో వేస్తారు. ఒకవైపు నూనెను, మరోవైపు కళేబరాలు, వ్యర్థాల పొడిని బయటకు తీస్తారు. ఈ పొడిని చేపలు, కోళ్లకు దాణాగా వాడుతారు. తక్కువ ధరకు నూనెను హోటళ్లకు సరఫరా చేస్తారు. వ్యర్థాలను ఇలా పొడిచేసే క్రమంలో భరించలేని దుర్వాసన వస్తుంది. 
logo
>>>>>>