శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 23:59:57

కరోనా చికిత్సకు ఔషధం తయారీ

కరోనా చికిత్సకు ఔషధం తయారీ

  • హైదరాబాద్‌ కేంద్రంగా పరిశోధనలు
  • సిప్లా సహకారంతో నాలుగు నెలల్లో మార్కెట్లోకి

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మానవాళి మనుగడకే సవాలు విసురుతూ.. ప్రపంచమంతటా మృత్యుఘంటికలు మోగిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టే ఔషధం తయారీకి హైదరాబాద్‌ కేంద్రంగా పరిశోధనలు మొదలయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో పరిశోధనలు సాగుతున్నాయి. ఈ పరిశోధనలకు తగిన సహకారం అందించేందుకు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సిప్లా ముందుకొచ్చింది. ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చిన కొన్ని డ్రగ్స్‌ సాయంతో ఔషధం తయారీకి ప్రయత్నిస్తున్నామని ఐఐసీటీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. పదిమంది శాస్త్రవేత్తలు, మరో 30 మంది నిపుణులు ఈ పనిలో నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ఎయిడ్స్‌, క్యాన్సర్‌ వంటి వ్యాధుల చికిత్సకు ఔషధాలను తయారుచేసిన ఐఐసీటీ ఈసారి కరోనా కట్టడికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ఫెవిపిరవిల్‌, రెమిడిసవిర్‌, టెలాక్సివిర్‌ అనే డ్రగ్స్‌ కరోనాకు విరుగుడుగా పనిచేయవచ్చని ఐఐసీటీ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది. 

ఈ డ్రగ్స్‌పై ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. అయితే మార్కెట్లో వీటి అవసరం రాకపోవడంతో వాటి ఉత్పత్తిని ప్రారంభించలేదు. ఈ డ్రగ్స్‌ పారిశ్రామిక స్థాయిలో టాబ్లెట్లు, ఇంజెక్షన్ల రూపంలో తయారుచేసి ఎటువంటి షరతులు లేకుండా మార్కెట్లోకి విడుదల చేయడానికి సిప్లా సిద్ధమవుతున్నది. నాలుగు నెలల్లోగా ఔషధాన్ని విడుదల చేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చంద్రశేఖర్‌ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. రెండు షిఫ్టుల్లో శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని చెప్పారు. తాము ఔషధాన్ని తయారుచేసి సిప్లాకు అందిస్తామని, ఆ సంస్థ భారీస్థాయిలో వాటిని ఉత్పత్తి చేస్తుందని తెలిపారు.


logo