మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 03, 2020 , 19:28:30

గర్భిణులు, పిల్లలు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

గర్భిణులు, పిల్లలు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

హైదరాబాద్ : లాక్ డౌన్ నుంచి నేటి వరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్ వాడీల ద్వారా జరుగుతున్న నిత్యావసర సరుకులు, ఆంగన్ వాడీ సేవలు అందుతున్న తీరుపై.. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆ శాఖ కమిషనర్  దివ్య, ఇతర అధికారులతో కలిసి మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సమయంలో గర్భిణులు, బాలింతలు, స్త్రీలు ఎక్కువగా వైరస్ బారిన పడే అవకాశం ఉన్నందున నివారణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్ వాడీల్లో కొవిడ్ నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా ప్రీ స్కూల్ నిర్వహిస్తున్నాం. 

ఇది ఇంకా అందరికీ బాగా చేరే విధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖలో సూపర్ వైజర్ గ్రేడ్ - 2 పోస్టులకు దరఖాస్తులు కోరాం. ఇది సరైన విధంగా జరిగేటట్లు, ఎక్కడా ఏ పొరపాటు జరగకుండా ఈ భర్తీ కార్యక్రమం జరగాలన్నారు. చిన్న పిల్లలు, మహిళలపై ఇటీవల దాడులు పెరుగుతున్నట్లు ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా దాడులు జరిగిన సమయంలో మహిళలు, శిశువులకు అండగా మేమున్నామనే  విధంగా ఈ శాఖ అధికారులు పనిచేయాలని సూచించారు. 

లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించిన తర్వాత కూడా చాలా వరకు ఆడపిల్లలు పుట్టకుండా అబార్షన్ జరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. పరీక్షలు చేసే స్కానింగ్ కేంద్రాలను నిషేధించిన తర్వాత ఇవి జరుగుతుంటే శాఖ పరంగా కఠినచర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రతి అంగన్ వాడీ కేంద్రంలో మునక్కాయ, బొప్పాయి, కరివేపాకు, పండ్ల మొక్కలు నాటాలన్నారు. అనంతరం శిశు విహార్ లోని శిశువుల కోసం సమకూర్చిన ప్రత్యేక అంబులెన్స్ ను మంత్రి ప్రారంభించారు. హరితహారంలో భాగంగా శిశు విహార్ లో పిల్లలకు ఉపయోగపడే పండ్ల మొక్కలు నాటారు. 

logo