బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 01:00:43

సహకారంలో బీసీలకు ప్రాధాన్యం

సహకారంలో బీసీలకు ప్రాధాన్యం
  • రిజర్వేషన్లు లేకున్నా చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవుల్లో 50శాతం
  • సామాజిక న్యాయంపై సకలజనుల హర్షం
  • సీఎం కేసీఆర్‌కు పలువురు ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ మరోసారి పదవుల పంపకాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీవర్గాల అభివృద్ధికి ప్రభుత్వపరంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నది. దీంతోపాటు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ఆయా వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యంలోనూ ప్రాధాన్యం కల్పించేలా పార్టీ నిర్ణయాలు తీసుకొంటున్నది. తాజాగా జరిగిన డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవుల ఎంపికలోనూ సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చారు. చట్టం ప్రకారం ఎలాంటి రిజర్వేషన్లు లేకపోవడంతో ఇన్నాళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కచ్చితంగా ఎన్ని పదవులు దక్కుతాయన్న స్పష్టతలేదు. రిజర్వేషన్లు లేని సహకార బ్యాంకుల పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటించి బడుగు, బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి సీఎం కేసీఆర్‌ ఆయా వర్గాల పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకొన్నారు. స్వరాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాల సంక్షేమంతోపాటు రాజ్యసభ, శాసనమండలి, మున్సిపల్‌ వంటి ప్రతిష్ఠాత్మక స్థానాల్లోనూ సామాజిక సమతూకాన్ని పాటించింది. శనివారం జరిగిన డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ మొత్తం 36 పదవుల్లో 17 (దాదాపు 50 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీవర్గాలకు కేటాయించారు. దీంతో రాష్ట్రంలోని సకలజనులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.


బీసీ సంఘాల జేఏసీ హర్షం

సహకార ఎన్నికల్లో వెనుకబడినవర్గాలకు పెద్దపీట వేయడం పట్ల తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ హర్షం వ్యక్తంచేసింది. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్వాల జితేందర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు యాద శంకర్‌, యూత్‌ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ బీసీలకు పెద్దపీట వేస్తున్నదని వారు కొనియాడారు.


బీసీలకు సముచిత స్థానం: మంత్రి తలసాని

డీసీసీబీల చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీవర్గాలకు టీఆర్‌ఎస్‌ సముచితస్థానం కల్పించిందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. సామాజిక న్యాయం పాటించిన ఘనత టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్‌, వైస్‌చైర్మన్లకు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వపై నమ్మకంతోనే ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పట్టారని అన్నారు.


సామాజిక సమతూకం: విప్‌ బాల్క సుమన్‌

డీసీసీబీ, డీసీఎంఎస్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌, పంచాయతీ, పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సామాజిక సమతూకాన్ని పాటించిందని బాల్క సుమన్‌ చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు వచ్చేలా సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. సామాజిక సమతూకం విషయంలో ఇతర రాష్ట్రాలకు, రాజకీయ పార్టీలకు టీఆర్‌ఎస్‌ ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, పెరిక, మున్నూరుకాపు, యాదవ, లింగాయత్‌లకు పదవులు దక్కాయని తెలిపారు. 


ఇది కొత్త చరిత్ర: మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌

సహకార పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త చరిత్ర లిఖించారని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు నిర్విరామంగా              కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌.. అన్ని కులాలు, వర్గాలవారికి న్యాయంచేస్తూ సామాజిక తెలంగాణను సాకారం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీల జీవితాల్లో మహాత్ముడు జ్యోతిబా పూలే ఎలా వెలుగులు నింపారో.. ఇప్పుడు కేసీఆర్‌ కూడా పూలే ఆదర్శాలను కొనసాగిస్తూ వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. అందుకే తెలంగాణ జ్యోతిబా పూలేగా కేసీఆర్‌ నిలిచిపోతారన్నారు.


logo
>>>>>>