ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 23:53:18

పచ్చదనానికి పునర్జీవం

పచ్చదనానికి పునర్జీవం

  • ఆదిలాబాద్‌ అడవులకు పూర్వవైభవం  
  • సత్ఫలితాలు ఇస్తున్న ఏఎన్నాఆర్‌ పద్ధతి

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘ఆదిలాబాద్‌ జిల్లరా.. అది ఎర్రనీ అడవిమల్లెరా.. పచ్చని అడవంతా ఆకాశామైతే పల్లెలన్నీ జాబిల మ్మారా’..అంటూ ఆదిలాబాద్‌ జిల్లా అడవుల వైభవాన్ని వర్ణించాడో కవి. అలాంటి దట్టమైన అడవులు కలప అక్రమ రవాణాతో పలుచబడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అడవుల జిల్లా ఆదిలాబాద్‌కు పూర్వవైభవం తీసుకురానున్నది. అటవీశాఖ చేపట్టిన క్షీణించిన అడవుల పునర్జీవం(రెజువనేషన్‌ ఆఫ్‌ ది గ్రేడెడ్‌ ఫారెస్ట్‌) కార్యక్రమంతో అడవులు కొత్త చిగురు తొడుగుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 1706.89 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉండగా, జిల్లా భూ భాగంలో అది 41.1 శాతం. ఆదిలాబాద్‌, మావల, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, ఇచ్చోడ, బోథ్‌, బజార్‌హత్నూర్‌, తలమడుగు, తాంసి మండలాల్లో దట్టమైన అడవులు ఉన్నాయి. 

గతంలో కలప అక్రమ రవాణా కారణంగా జిల్లాలోని అటవీ విస్తర్ణం కొంత తగ్గింది. హరితహారంలో భాగంగా అడవులను పునరుద్ధరించడానికి అటవీశాఖ అధికారులు క్షీణించిన అడవుల పునర్జీవనం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, ఇచ్చోడ అటవీ డివిజన్లలో ఐదేండ్లుగా మొక్కలు నాటారు. దీంతో ప్రస్తు తం  అటవీ ప్రాంతం దట్టంగా మారింది. మావలలో 500 హెక్టార్లు, దేవాపూర్‌లో 500 హెక్టార్లు అడవులు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. జిల్లాలో హరితహారం పనులతో గతంలో హెక్టారుకు 500 వరకు ఉన్న చెట్లు ప్రస్తుతం 700 వరకు పెరిగినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు భారీగా చెట్లు నరికివేతకు గురైన అటవీప్రాంతాల్లో చేపట్టిన సహజ పునరుత్పత్తి(ఎయిడెడ్‌ నేచురల్‌ రీజనరేషన్‌) పద్ధతిలోనూ చెట్లు పచ్చబడి సత్ఫలితాలు వస్తున్నాయని అటవీ అధికారులు వెల్లడించారు.


logo