సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 01:38:36

సీఎం వద్దకు పీఆర్సీ!

సీఎం వద్దకు పీఆర్సీ!

  • సిఫారసులపై త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు
  • కేసీఆర్‌కు నివేదించిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  • నేడు లేదా రేపు ఉద్యోగ సంఘాలతో భేటీ
  • పదోన్నతులకు రెండేండ్ల సీనియారిటీ
  • అనుమతి కోసం ముఖ్యమంత్రి వద్దకు ఫైల్‌
  • ఏపీ నుంచి స్వరాష్ర్టానికి తెలంగాణ ఉద్యోగులు!

త్వరలోనే పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు పెంపుపై స్పష్టత రానున్నట్టు తెలుస్తున్నది. పీఆర్సీపై ప్రకటన చేయడానికి ముందు సీఎం కేసీఆర్‌ ఉద్యోగ సంఘాలతో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనికి ముందుగా త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నది.

హైదరాబాద్‌, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ, పదోన్నతుల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. ఏపీ నుంచి స్వరాష్ర్టానికి తీసుకొని వచ్చే తెలంగాణ ఉద్యోగుల జాబితా కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. వీటిపై ముఖ్యమంత్రి ఆమోదం లభించగానే ఈ ప్రక్రియలన్నీ రెండు మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ) చేసిన సిఫారసులపై త్రిసభ్య కమిటీ చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వద్దకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఉద్యోగులకు పదోన్నతి కల్పించేందుకు సీనియారిటీని రెండేండ్లుగా పరిగణించే అంశం కూడా సీఎం వద్దకు చేరినట్టు తెలిసింది. పీఆర్సీ ఖరారు కావడానికి ముందు మరిన్ని సమావేశాలు జరుగాల్సి ఉండగా, పదోన్నతులకు సీనియారిటీని ఖరారు చేసే విషయంలో అధికారులు సీఎం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. 

పీఆర్సీ నివేదికపై త్రిసభ్య కమిటీ బీఆర్కేభవన్‌లో బుధవారం సమావేశమైంది. కమిటీ సభ్యులు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావు, సాగునీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ పీఆర్సీ నివేదికపై చర్చించినట్టు సమాచారం. అనంతరం ఈ కమిటీ చేసిన ప్రతిపాదనలను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సీఎం వద్దకు తీసుకువెళ్లినట్టు తెలిసింది. దీంతో త్వరలోనే పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు పెంపుపై స్పష్టత రానున్నట్టు తెలుస్తున్నది. పీఆర్సీపై ప్రకటన చేయడానికి ముందు సీఎం కేసీఆర్‌ ఉద్యోగ సంఘాలతో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనికి ముందుగా త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నది. తెలంగాణ స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ శాశ్వత సభ్యులైన టీఎన్జీవో, టీజీవో, సెక్రటేరియట్‌ అసోసియేషన్‌, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌, తెలంగాణ స్టేట్‌ క్లాస్‌ ఫోర్‌ ఎంప్లాయీస్‌ సెంట్రల్‌ అసోసియేషన్‌, ట్విన్‌సిటీస్‌ తెలంగాణ గవర్నమెంట్‌ వెహికల్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ స్టేట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌ ఎస్‌టీయూ), పీఆర్టీయూ టీఎస్‌, టీఎస్‌ యూటీఎఫ్‌లతో పాటు గుర్తింపు పొందిన సంఘాలతో ఒకటి రెండు రోజుల్లో చర్చలు జరిగే అవకాశం ఉన్నది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలు అందుబాటులో ఉండాలని వారికి ప్రభుత్వం నుంచి సమాచారం అందినట్లు తెలిసింది.

పదోన్నతులకు రెండేండ్ల సీనియారిటీ

మరోవైపు అధికారులు.. ఉద్యోగుల పదోన్నతులు, కారుణ్యనియామకాలపై దృష్టి సారించారు. పదోన్నతులపై సీఎస్‌ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శాఖల వారీగా జిల్లాల్లో కూడా డీపీసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏ యే శాఖల్లో పదోన్నతులు చేయాలి, ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలెన్ని తదితర వివరాలను ఉద్యోగ సంఘాలు అధికారులకు అందిస్తున్నాయి. పదోన్నతులకు ఇప్పటివరకు మూడు సంవత్సరాల సీనియారిటీని పరిగణనలోకి తీసుకున్నారు. కాగా దీనిని రెండు సంవత్సరాలకు కుదించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతున్నాయి. రెండు సంవత్సరాల కనీస సీనియారిటీని నిర్ణయిస్తే కిందిస్థాయిలో చాలామందికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉన్నతాధికారులు దీనికి సంబంధించిన ఫైల్‌ను కూడా ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపించినట్టు తెలిసింది. 

స్వరాష్ర్టానికి తెలంగాణ ఉద్యోగులను రప్పించే ప్రక్రియ

ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి రప్పించే ప్రక్రియ వేగం పుంజుకున్నది. ఏపీలో పనిచేస్తూ.. స్వరాష్ర్టానికి రావడానికి సమ్మతిని తెలిపిన తెలంగాణ ఉద్యోగుల జాబితాను ప్రభుత్వం తయారుచేసింది. ఆ జాబితాలో అటెండర్లు 625, జానియర్‌ అసిస్టెంట్లు 23, సీనియర్‌ అసిస్టెంట్లు 62, సూపరింటెండెంట్లు 31, టెక్నికల్‌ ఆఫీసర్‌ 1, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ 1, కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ 2, ల్యాబ్‌ టెక్నీషియన్లు 3, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఒకరు ఉన్నారు. వీరందరిని తెలంగాణకు తీసుకురావడానికి అనుమతి కోసం ఫైలును సీఎం కార్యాలయానికి పంపించారు. ఈ ఫైల్‌పై సీఎం సంతకం చేయగానే వారిని తెలంగాణకు తీసుకొస్తారు.