గురువారం 28 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 01:47:46

భవిష్యత్‌ మార్గదర్శి తొలి పీఆర్సీ!

భవిష్యత్‌ మార్గదర్శి తొలి పీఆర్సీ!

  • రెండున్నరేండ్లపాటు సుదీర్ఘ కసరత్తు
  • కమిషన్‌ కాలపరిమితి నేటితో ముగింపు 
  • ఉద్యమ ఆకాంక్షకు ప్రతీకగా నివేదిక!
  • నేడో రేపో ప్రభుత్వానికి సమర్పణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో ఏర్పడిన మొదటి పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్సీ) భవిష్యత్‌ మార్గదర్శిగా నిలువనున్నది. సీఎం ఆదేశాల మేరకు ఉద్యోగుల సమస్యలు, ఉద్యమ ఆకాంక్షను నేరవేర్చేలా కమిషన్‌ సుదీర్ఘ కసరత్తు చేసింది. రెండున్నరేండ్లుగా వివిధ అంశాలపై ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు సేకరించి నివేదికను రూపొందించింది. దీనిని నేడో, రేపో ప్రభుత్వానికి అందజేయనున్నది. సీఎం కేసీఆర్‌ 2018 మే నెలలో ముగ్గురు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో ఏర్పాటుచేసిన మొదటి పీఆర్సీ కాలపరిమితి గురువారంతో ముగుస్తున్నది. స్వరాష్ట్రంలోనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆత్మగౌరవంగా బతుకగలుగుతారని భావించి ఉద్యోగులు ఉద్యమించారని, ఆ ఉద్యమ ఆకాంక్షలు ప్రతిఫలించేలా పీఆర్సీ ఉండాలని సీఎం కేసీఆర్‌ భావించారు. పే ఫిక్సేషన్‌తోపాటు సర్వీసు నిబంధనలను సులభతరంగా రూపొందించాలని, శాఖలవారీగా ఎక్కడ ఎంతమంది అధికారులు, సిబ్బంది ఉన్నారు? ఉద్యోగులను స్ట్రీమ్‌లైన్‌ చేయడం, కరవు భత్యం, జీతాలు అలవెన్స్‌లు, ఇంక్రిమెంట్లు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఇలా అన్నింటిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. కొత్త రాష్ట్రంలో కొత్త సర్వీసు రూల్స్‌ ఉండాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఎప్పుడు పదోన్నది వస్తుందో ఉద్యోగంలో చేరిననాడే కచ్చితంగా తెలిసేలా క్యాలెండర్‌ ఉండాలని సీఎం భావించారు. ఈ మేరకు అన్నీ క్యాలెండర్‌ ప్రకారమే జరిగేలా సర్వీస్‌ రూల్స్‌ సరళతరంగా ఉండేలా కసరత్తు చేసింది.

సుదీర్ఘ సమావేశాలు

ఏర్పాటైన వెంటనే కమిషన్‌ తన పనిని మొదలుపెట్టింది. ఉద్యోగులు పెద్దఎత్తున కమిషన్‌కు వినతిపత్రాలు అందించారు. కొంతమంది ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు తెలిపారు. గుర్తింపు పొందిన, రిజిస్టర్డ్‌ సంఘాలు దాదాపు 170 వరకు వినతిపత్రాలు అందించాయి. మొదట కేవలం గుర్తింపుపొందిన సంఘాల నుంచే వినతులు స్వీకరించాలని భావించినా.. తర్వాత అందరి నుంచీ తీసుకున్నది. వాటన్నింటినీ భద్రపరిచిన కమిషన్‌.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో వరుసగా సమావేశాలు నిర్వహించింది. ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాల అభిప్రాయాలను రికార్డు చేసుకున్నది. అలాగే అన్ని ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగులు, అధికారుల సంఖ్య, ఎంతమంది ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు? వారి పనిస్వభావం ఏమిటి తదితర విషయాలను శాఖలవారీగా నివేదికల రూపం లో తెప్పించుకున్నది. అనంతరం శాఖలవారీగా అధికారులతోనూ సమావేశాలు నిర్వహించింది. ఇదే సమయంలో పేకమిషన్‌ నివేదికలు, వాటి ఫార్మూలాలను కూడా అధ్యయనం చేసింది. ఇలా అన్నిరకాలుగా అధ్యయనం చేసి కమిషన్‌ నివేదికను రూపొందించింది. స్వరాష్ట్రంలో ఏర్పడిన తొలి కమిషన్‌.. భవిష్యత్‌ కమిషన్‌లకు మార్గదర్శకంగా ఉండేలా నివేదికను రూపొందించిందని ఉద్యోగ, అధికారవర్గాలు భావిస్తున్నాయి.


సంబురాల్లో ఉద్యోగులు  

ఉద్యోగులకు నూతన పీఆర్సీ, విరమణ వయసు పెంపు, ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో సంబురాలు అంబరాన్నంటాయి. బుధవారం పలుచోట్ల ఉద్యోగులు సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. హైదరాబాద్‌ టీఎన్జీవోల సంఘం అధ్యక్షులు ముజీబ్‌ ఆధ్వర్యంలో నాంపల్లిలోని సంఘం కార్యాలయం వద్ద ఉద్యోగులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరికీ వేతనం పెంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడంపై పర్యాటకశాఖ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ యూనియన్‌ హర్షం వ్యక్తంచేసింది. ఉద్యోగులతోపాటే తమకు వేతనాలు పెంచుతారని అనుకోలేదని ఐకేపీ వీవోఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిపెల్లి మాధవి, ఆర్పీల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు మానుకోట సునీత ఆనందం వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. నిర్మల్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద చైర్మన్‌, కౌన్సిలర్లు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, చెన్నూరులో అంగన్‌వాడీలు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నల్లగొండలో ఆర్టీసీ, మెప్మా, అంగన్‌వాడీ ఉద్యోగులు సీఎం, మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. logo