సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:46:05

దర్శకుడు రాంగోపాల్‌వర్మపై కేసు

దర్శకుడు రాంగోపాల్‌వర్మపై కేసు

  • ‘మర్డర్‌'పై కోర్టును ఆశ్రయించిన ప్రణయ్‌ తండ్రి
  • కోర్టు ఆదేశాలతో మిర్యాలగూడలో కేసు

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మతో పాటు మర్డర్‌ సినిమా నిర్మాత నట్టి కరుణపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఎస్టీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నల్లగొండ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేకకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదుచేసినట్టు ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. ఎస్పీ కథనం ప్రకారం.. మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్‌లో జరిగిన ప్రణయ్‌ హత్యకేసు విచారణ నల్లగొండ ప్రత్యేక కోర్టులో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాంగోపాల్‌వర్మ మర్డర్‌ పేరుతో ప్రణయ్‌ హత్య కేసు ఇతివృత్తంగా సినిమా నిర్మించనున్నట్టు ఫాదర్స్‌డే రోజున పోస్టర్‌ విడుదల చేశారు. పోస్టర్‌లో మర్డర్‌ సినిమా నిర్మాతగా నట్టి కరుణ పేరును ప్రస్తావించారు. మర్డర్‌ సినిమా పోస్టర్‌, దానిపై ఆర్జీవీ సోషల్‌మీడియా వేదికగా చేసిన వాఖ్యలపై ప్రణయ్‌ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి  కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ఎస్సీ,ఎస్టీ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి నాగరాజు విచారణ జరిపారు. దర్శకుడు రాంగోపాల్‌వర్మతోపాటు నిర్మాత నట్టి కరుణలపై కేసు నమోదుచేసి విచారణ జరపాలని శనివారం మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసులకు ఆదేశాలు జారీచేశారు


logo