శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 02:10:14

తెలంగానమెరిగిన ప్రణబ్‌దా..

తెలంగానమెరిగిన ప్రణబ్‌దా..

  •  రాష్ట్రపతి హోదాలో రాష్ట్ర ఏర్పాటుకు సంతకం.. 
  • సీఎం కేసీఆర్‌ అంటే ప్రత్యేక వాత్సల్యం
  •  యాదగిరిగుట్ట సందర్శన.. ప్రశంస.. 
  • హైదరాబాద్‌ అంటే అమితమైన అభిమానం

తెలంగాణతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీది ప్రత్యేక అనుబంధం. రాష్ట్రపతి హోదాలో రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన సంతకం చరిత్రాత్మకం. ఉద్యమనేతగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అంటే ఆయనకు ప్రత్యేక వాత్సల్యం. సీఎం కేసీఆర్‌ అమలుచేసిన పథకాలు, పరిపాలనాతీరును ప్రశంసించారు. శేఖర్‌.. యూ ఆర్‌ డూయింగ్‌ వెల్‌.. అంటూ మెచ్చుకున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధినిచూసి ఫిదా అయ్యారు. హైదరాబాద్‌ అంటే ఆయనకున్న అభిమానం అంతాఇంతకాదు. ప్రణబ్‌ దాదా అంటే కూడా సీఎం కేసీఆర్‌కు అత్యంత గౌరవం. ఆయన మేధస్సుకు, అసాధారణ ప్రజ్ఞకు కేసీఆర్‌ శిరస్సు వంచి పాదాభిందనం చేయడం ఇందుకు తార్కాణం.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కేంద్రబిందువుగా వ్యవహరించారు. రాష్ట్రపతి హోదాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్టంపై చరిత్మ్రాతక సంతకం చేశారు. 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పటినుంచి అనేక సందర్భాల్లో ప్రణబ్‌ముఖర్జీతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. వారు ఎప్పుడు కలుసుకున్నా ప్రత్యేక రాష్ట్రమే తనకు ముఖ్యమని, అది తప్పితే మరేదీ అక్కరలేదని కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని స్వయంగా ప్రణబ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో టీఆర్‌ఎస్‌కు భాగస్వామ్యం కల్పిస్తున్న సందర్భంలోనూ.. ‘నాకు కావాల్సింది ప్రత్యేక తెలంగాణ. నాకు ఏ పోర్ట్‌ఫోలియో ఇచ్చినా అంత ముఖ్యంకాదు. ఏదిచ్చినా సంతోషంగా అంగీకరిస్త. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ను మాత్రం మరువద్దు’ అని సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు ప్రణబ్‌దాదా రాసిన ‘ద కొలిషన్‌ ఇయర్స్‌' పుస్తకంలో ప్రస్తావించారు. తర్వాత తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన కమిటీకి చైర్మన్‌గా కూడా ప్రణబ్‌ వ్యవహరించారు. 

సీఎం కేసీఆర్‌కు ప్రశంస

2015లో హైదరాబాద్‌కు వచ్చిన ప్రణబ్‌.. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ పరిపాలనా పద్ధతిని మెచ్చుకున్నారు. శేఖర్‌.. యూ ఆర్‌ డూయింగ్‌ వెల్‌ అంటూ కితాబిచ్చారు. ‘కొత్త రాష్ట్రమైనా ఎక్కడా అలాంటిది కనిపించకుండా మంచి పథకాలు అమలుచేస్తున్నారు. గో అహెడ్‌' అంటూ ప్రశంసించారు. 2015 డిసెంబర్‌లో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ఆయుత చండీ మహాయాగానికి కూడా రాష్ట్రపతి హోదాలో వచ్చారు. అనుకోని పరిస్థితుల్లో ఆయన ఎర్రవల్లిలో దిగకుండానే వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. సీఎం కేసీఆర్‌కు కూడా ప్రణబ్‌దా అంటే ప్రత్యేక అభిమానం. అందుకే ఆయనకు పాదాభివందనంచేసి తన కృతజ్ఞతను చాటుకునేవారు.

 యాదాద్రి అభివృద్ధికి ఫిదా

ప్రత్యేక శ్రద్ధతో పునర్నిర్మిస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ప్రణబ్‌ముఖర్జీ 2015 జూన్‌ ఐదున సీఎం కేసీఆర్‌తో కలిసి సందర్శించారు. అభివృద్ధిచేస్తున్న తీరును చూసిన ప్రణబ్‌ ఫిదా అయ్యారు. నూతన ఆలయ నమూనాను పరిశీలించి సీఎం కేసీఆర్‌ను మెచ్చుకున్నారు. హెలిపాడ్‌ నుంచి ఆలయం వరకు రాష్ట్రపతి కారులోనే ప్రణబ్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ ప్రయాణించారు. అనేక విషయాలను మాట్లాడుకున్నారు. అది వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, అనుబంధం, వాత్యల్యానికి ప్రతీక. హైదరాబాద్‌ అంటే అభిమానం

‘ఎన్నో శాతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌.. ఆధునిక యుగంలో హైటెక్‌సిటీగా, సైబర్‌ సిటీగా రూపుదిద్దుకున్నది. ఐటీ ఇక్కడి నుంచే ప్రారంభం అయ్యింది. విద్యా కేంద్రంగా విలసిల్లుతున్నది. విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఇక్కడి ప్రజలు. ఆధునిక నాగరికత కేంద్రం. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఈ నగరమంటే తెలుగువారికే కాదు.. దేశానికీ ఇష్టమే’ అంటూ ప్రణబ్‌దా కితాబిచ్చారు. 


logo