పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్ : ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక కార్యక్రమం ప్రారంభించినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆన్లైన్ ఫిర్యాదుల సేకరణ ప్రజా వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేసేందుకే ప్రజా వేదిక కార్యక్రమం చేపట్టాము అని స్పష్టం చేశారు. ప్రతి ఫిర్యాదుదారుడి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ ఉంటుందన్నారు. ప్రతి గురువారం అధికారులు, మంత్రిగా తాను ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో అధికారులు అందుబాటులో ఉంటున్నారు. సామాన్యుడికి మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో ప్రజావేదిక కార్యక్రమం చేపట్టాము అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ఫిర్యాదులు కూడా తీసుకొని సంబంధిత ఎమ్మెల్యే, అధికారులకు పంపిస్తామన్నారు. వైద్య సహాయం కోసం ఎమ్మెల్యే కార్యాలయంలో 24 గంటలు సంప్రదించవచ్చు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.