బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 13:10:26

బోర్లకు మీటర్లు పెడతామంటున్న బీజేపీకి గుణ పాఠం చెప్పండి

బోర్లకు మీటర్లు పెడతామంటున్న బీజేపీకి గుణ పాఠం చెప్పండి

సిద్దిపేట : జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. దుబ్బాక మున్సిపాలిటీ 4వ వార్డు దుంపలపల్లిలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలు,5వ వార్డులో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న వార్డు ఆఫీస్ కార్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 

ప్రతి వీధిలో కలియ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చెల్లాపూర్ లో మంత్రి పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..16 కుల సంఘాలకు భవనాలు కావాలని ఆయా సంఘాలు కోరాయి. రెండు రోజుల్లో కోటి రూపాయలు మంజూరు చేయించి నిధులు పంపిస్తానని మంత్రి హామీనిచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలో 3 వేల ఇండ్ల నిర్మాణానికి కాలనీలు నిర్మించామని తెలిపారు. త్వరలోనే మీ జాగలో మీరే ఇండ్లు కట్టుకోవచ్చునని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యం అవుతున్నదని స్పష్టం చేశారు.


ప్రతి నియోజకవర్గ పరిధిలో వెయ్యి ఇండ్లు వారి సొంత స్థలంలో నిర్మించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. దుబ్బాకకు వెయ్యితో పాటు అదనంగా వెయ్యి ఇండ్ల నిర్మాణాలు చేసుకునేలా సీఎం కేసీఆర్ అనుమతి తీసుకుందామన్నారు. చంద్రబాబు పాలనలో బాయిల కాడ బోర్లకు మీటర్లు పెడతానంటే.. రైతులంతా బాబుకు మీటర్లు పెట్టి వెనక్కి పంపారని, అదే విధంగా బీజేపీ ప్రభుత్వానికి దుబ్బాక ప్రజలు తగిన గుణపాఠం ఓటు రూపంలో చెప్పాలని కోరారు. బాయిల కాడ మీటర్లు పెడితే.. 2,500 కోట్లు ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆఫర్ ఇస్తే .. మీటర్లు వద్దు, 2,500 కోట్లు వద్దు.. మా తెలంగాణ రైతుల సంక్షేమమే మాకు ముద్దు అని సీఎం కేసీఆర్ తిరస్కరించినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

కరోనా దృష్ట్యా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాం. కానీ సంక్షేమ పథకాలు ఎక్కడా ఆపలేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి తెచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి రైతులు పాలాభిషేకం చేస్తే.. రైతుల నడ్డి విరిచే చట్టం తెచ్చిన కేంద్ర ప్రభుత్వం పై నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందంతో చేసుకుని నయా జమీందారి వ్యవస్థను తెచ్చింది ఎవరి ప్రయోజనాల కోసమో చెప్పాలని బీజేపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్రించారు.logo