మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 02:24:27

మే 4 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు

మే 4 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు

  • 10వ, 12వ తరగతుల పరీక్షల తేదీలు ప్రకటించిన కేంద్ర మంత్రి  పోఖ్రియాల్‌
  • జూన్‌ 10 వరకు పరీక్షల నిర్వహణ
  • జూలై 15లోపు ఫలితాలు వెల్లడి
  • మార్చి 1 నుంచే స్కూళ్లలో ప్రాక్టికల్స్‌

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) పరిధిలోని పాఠశాలల్లో 10వ, 12వ తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ గురువారం ప్రకటించారు. ఈ ఏడాది మే 4 నుంచి జూన్‌ 10వ తేదీ వరకు ఈ తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్ష ఫలితాలను జూలై 15లోపు ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రాక్టికల్‌ పరీక్షలు మాత్రం పాఠశాలల్లో మార్చి 1వ తేదీ నుంచే ప్రారంభమవుతాయని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ తేదీలను ఖరారు చేశామని వివరించారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. విదేశాల్లోని సీబీఎస్‌ఈ పాఠశాలల విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహించాలన్నదానిపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. కరోనా కారణంగా గతేడాది మార్చిలోనే పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 15 తర్వాత కేంద్రం ఆంక్షలను సడలించటంతో పలుచోట్ల పాఠశాలలను పాక్షికంగా తెరిచారు. 

రాతపరీక్షలే..

సాధారణంగా సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌ జనవరిలోనే ప్రారంభమవుతాయి. ఈ ఏడాది కరోనా కారణంగా మూడు నెలలు ఆలస్యంగా జరుగనున్నాయి. దీర్ఘకాలంపాటు పాఠశాలలు మూసి ఉండటంతో విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పే ఏర్పాట్లు చేసింది. కొన్ని పాఠశాలలు ప్రీ ఫైనల్‌ పరీక్షలను ఇప్పటికే నిర్వహించాయి. నిజానికి ఈ ఏడాది బోర్డు పరీక్షలు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో జరుగుతాయని అందరూ భావించారు. కానీ ఎప్పటిలాగే రాతపరీక్షలే నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ఇటీవలే స్పష్టత ఇచ్చింది.


logo