బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:25:33

వెయ్యిఎకరాలు దత్తత తీసుకుంటా

వెయ్యిఎకరాలు దత్తత తీసుకుంటా

  • రిజర్వ్‌ ఫారెస్ట్‌ అభివృద్ధి: సినీనటుడు ప్రభాస్‌
  • అభిమానులు పెద్దఎత్తున మొక్కలు నాటాలని విజ్ఞప్తి 
  • మనసున్న మనిషి ప్రభాస్‌: ఎంపీ సంతోష్‌కుమార్‌
  • గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ మూడోవిడుత ప్రారంభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘పుడమి పచ్చగుండాలె- మన బతుకులు చల్లగుండాలె’ నినాదంతో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ మూడో విడుత ప్రారంభమైంది. సీనియర్‌ నటుడు కృష్ణంరాజు విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన సినీనటుడు ప్రభాస్‌.. గురువారం తన నివాసంలో ఎంపీ సంతోష్‌తో కలిసి మూడుమొక్కలు నాటి మూడోవిడుత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సినీనటులు రామ్‌చరణ్‌, దగ్గుబాటి రానా, శ్రద్ధాకపూర్‌ను గ్రీన్‌ఇండియా చాలెంజ్‌కు నామినేట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం ఉన్నతమైన విలువలతో కూడుకున్నదని ప్రశంసించారు. కీసర ఫారెస్ట్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం తననెంతో ఆకట్టుకున్నదని.. ఎంపీ సూచించిన చోట వెయ్యి ఎకరాలకుపైగా రిజర్వ్‌ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. సంతోష్‌ మహోన్నతమైన ఆశయాన్ని మనందరం ముందుకుతీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదన్నారు. అభిమానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కోట్ల మొక్కలు నాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. ఎంపీ సంతోష్‌ మాట్లాడుతూ.. ప్రభాస్‌ సమాజంపట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడని తెలిపారు. గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి మూడుమొక్కలు నాటడంతోపాటు, రిజర్వ్‌ ఫారెస్ట్‌ అభివృద్ధికి పూనుకోవడం స్ఫూర్తిదాయకమని అన్నారు. మంచి మనస్సున్న ప్రభాస్‌ చేతులమీదగా గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ మూడో విడుత కార్యక్రమం ప్రారంభం కావడం సంతోషంగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ సమన్వయకర్త సంజీవ్‌ రాఘవ తదితరులు పాల్గొన్నారు.


logo