గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 02:08:48

హోరెత్తిన విద్యుత్‌సౌధ

హోరెత్తిన విద్యుత్‌సౌధ

  • రెండు రాష్ర్టాల ఉద్యోగుల ఆందోళన, తోపులాట 
  • సీఎండీ ప్రభాకర్‌రావు చొరువతో సద్దుమణిగిన వివాదం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జస్టిస్‌ ధర్మాధికారి ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు విడుదలచేసిన 655 మంది ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణలో చేర్చుకోవడాన్ని అడ్డుకొంటూ విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన నిరసనలు మూడోరోజుకు చేరుకొన్నాయి. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ, తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ నేతృత్వంలో పోరుబాట పట్టిన ఉద్యోగులు.. వేర్వేరుగా దీక్షలు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌధ, మింట్‌ కాంపౌండ్‌లోని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ కార్యాలయం ఎదుట దీక్షలకు దిగి ఆం దోళనలతో హోరెత్తించారు. 

విద్యుత్‌సౌధలోకి వస్తున్న ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకొన్నారు. తెలంగాణ వదిలి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. విషయాన్ని సీఎండీ డీ ప్రభాకర్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన ఆంధ్ర ఉద్యోగులతో మాట్లాడారు. జస్టిస్‌ ధర్మాధికారి మార్గదర్శకాలకు విరుద్ధంగా విడుదలచేసినవారిని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోబోమని, ఇక్కడ అనవసర రాద్ధాంతం చేయొద్దని సూచించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం సమసిపోయినట్లయింది.


logo
>>>>>>