సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 02:29:34

పొత్తూరి ఇకలేరు

పొత్తూరి ఇకలేరు
  • పెద్దదిక్కు కోల్పోయిన పాత్రికేయ ప్రపంచం
  • తెలంగాణ ఉద్యమానికి మద్దతునిచ్చిన పాత్రికేయుడు:సీఎం కేసీఆర్‌ సంతాపం
  • జర్నలిజానికి వన్నెతెచ్చారు: మంత్రి కేటీఆర్‌ నివాళి
  • మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు
  • తరలివచ్చిన పాత్రికేయగణం

హైదరాబాద్‌ /సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ అహ్మద్‌నగర్‌: సుప్రసిద్ధ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ పొత్తూరి వెంకటేశ్వర్‌రావు (86) గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ‘మల్టిపుల్‌ మైలోమా’ అనే బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న పొత్తూరి.. మూడు నెలలపాటు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్సపొందారు. మూడురోజుల క్రితం పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకొనివెళ్లారు. గురువారం ఉదయం 8.40 గంటలకు పొత్తూరి తుదిశ్వాస విడిచారు.  పొత్తూరి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. పత్రిక, సామాజిక ఆయనచేసిన కృషిని కొనియాడారు. తెలంగాణ ఉద్యమసమయంలో పొత్తూరి వెంకటేశ్వర్‌రావు అందించిన నైతిక మద్దతును సీఎం గుర్తుచేసుకొన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.


పొత్తూరి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు జర్నలిజానికి వన్నెతెచ్చిన వ్యక్తుల్లో ఒకరిగా పొత్తూరి చరిత్రలో నిలిచిపోతారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. నిఖార్సయిన జర్నలిజంతో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి పొత్తూరి అని ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ప్రణాళికాసంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్టీఐ కమిషనర్‌ కట్టా శేఖర్‌రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్‌ తదితరులు పొత్తూరి మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియజేశారు. పొత్తూరి మరణవార్త తెలియగానే పాత్రికేయులు, ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకొని నివాళులర్పించారు. 


ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీనియర్‌ పాత్రికేయులు కే శ్రీనివాస్‌రెడ్డి, కే శ్రీనివాస్‌, కే రామచంద్రమూర్తి, ఏబీకే ప్రసాద్‌, ఐ వెంకట్రావు, దేవులపల్లి అమర్‌, సీఎం సీపీఆర్వో వనంజ్వాలా నరసింహారావు, విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రముఖ కవి, కార్టూనిస్ట్‌ దేవీప్రియ, వంశీ రామరాజు, ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, వనమాల, వకుళాభరణం రామకృష్ణ, పాశం యాదగిరి, గద్దర్‌, రమా మెల్కోటే, రాందాస్‌, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరహత్‌ అలీ, ఐజేయూ కార్యదర్శి నరేందర్‌రెడ్డి, ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కేఎన్‌ హరి , నవతెలంగాణ సంపాదకుడు వీరయ్య, మానవ హక్కులవేదిక సభ్యులు ఎస్‌ జీవన్‌కుమార్‌, బండారు శ్రీనివాస్‌రావు, అంజద్‌ అలీఖాన్‌, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి  తదితరులు పొత్తూరి వెంకటేశ్వర్‌రావు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది.  పొత్తూరి అంత్యక్రియలు గురువారం సాయంత్రం మహాప్రస్థానం శ్మశానవాటికలో ముగిశాయి. ఆయనకు భార్య సత్యవాణి (79), ఇద్దరు కుమారులు ప్రేమగోపాల్‌, రహీ ప్రకాశ్‌, ఇద్దరు కుమార్తెలు వాత్సల్య, పద్మజ ఉన్నారు.


నైతిక విలువలున్న మానవతామూర్తి

జర్నలిస్ట్‌గానే కాక మానవతా, నైతిక విలువలు కాపాడిన పాత్రికేయుడిగా పొత్తూరి వెంకటేశ్వర్‌రావు ప్రసిద్ధిగాంచారు. మీడియాలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన 1934 ఫిబ్రవరి 8న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పొత్తూరులో వెంకటసుబ్బయ్య, గంగమ్మ దంపతులకు జన్మించారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఉదయం, వార్త మొదలైన పత్రికల్లో సుదీర్ఘకాలం సంపాదకుడిగా పనిచేశారు. వెంకటేశ్వర్‌ రావు 1957లో ఆంధ్రజనత పత్రికతో పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించారు. సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ అంశాలపై అనేక రచనలుచేశారు. \


గొప్ప ఆధ్యాత్మికవేత్త

బాహ్య ప్రపంచానికి పొత్తూరి వేంకటేశ్వరరావు గొప్ప పాత్రికేయుడిగా, రచయితగా మాత్రమే తెలుసు. కానీ ఆయన గొప్ప ఆధ్యాత్మిక సాధకుడు. కుర్తాళ శ్రీసిద్ధేశ్వరీపీఠ ధర్మాధికారిగా వ్యవహరించారు. ఆయన ఓ కర్మయోగి. అటువంటి మేధావి, మైత్రీ హృదయుడైన పొత్తూరి మరణం.. బాల్య మిత్రుడిగా నాకు, కుర్తాళం పీఠానికి తీరనిలోటు

- శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి, కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠం


logo