మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 05, 2020 , 13:04:44

విలువల జర్నలిజానికి నిజమైన ప్రతినిధి పొత్తూరి

విలువల జర్నలిజానికి నిజమైన ప్రతినిధి పొత్తూరి

హైదరాబాద్‌ : విలువల జర్నలిజానికి పొత్తూరి వెంకటేశ్వర రావు నిజమైన ప్రతినిధి అని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దిగ్గజ పాత్రికేయులు పొత్తూరి మృతిపట్ల మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. తెలంగాణ పోరాటానికి మద్దతుగా నిలిచిన పొత్తూరి మృతి పాత్రికేయరంగానికే గాక సమాజానికి తీరని లోటన్నారు. మానవీయతకు నిలువెత్తు నిదర్శనమన్నారు. పాత్రికేయ వృత్తిని అత్యంత బాధ్యతతో సామాజిక హితానికి, చైతన్యానికి వాడిన నిఖార్సైన జర్నలిస్టు అని కొనియాడారు. 

మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. తెలుగు పత్రికారంగానికి పొత్తూరి వెంకటేశ్వరరావు చేసిన సేవలు మరువలేనివన్నారు. నిఖార్సైన జర్నలిజంతో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్న మంత్రి పేర్కొన్నారు. 

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందిస్తూ.. పాత్రికేయరంగంలో పొత్తూరి సేవలు మరువలేనివన్నారు. పొత్తూరి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. 

మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ... పొత్తూరి మరణం జర్నలిజం ప్రపంచానికి తీరని లోటన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇక్కడి ప్రజల ఆకాంక్ష అంటూ నిష్కర్షగా చెప్పిన మహానుభావుడన్నారు.


logo
>>>>>>