ఆదివారం 12 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:04:51

ప్రవేశపరీక్షలు వాయిదా

ప్రవేశపరీక్షలు వాయిదా

  • యూజీ, పీజీ పరీక్షలపై త్వరలో నిర్ణయం 
  • హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
  • వాయిదాపడ్డ పరీక్షలు వచ్చే నెలలో! 
  • సమాలోచనలోఉన్నత విద్యామండలి 
  • దేశంలో అన్ని ఐఐటీ, ఎన్‌ఐటీలలో 2020-21 విద్యాసంవత్సరంలో సీట్ల భర్తీకోసం జూలై 18 నుంచి 

23 వరకు జేఈఈ-మెయిన్‌, 26న నీట్‌, ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ జరుగనున్నది. ఈ పరీక్షలను ఆయా తేదీల్లోనే నిర్వహిస్తే.. తెలంగాణలోనూ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అదే జరిగితే జాతీయ ఎంట్రన్స్‌లతోపాటు, రాష్ట్రంలో ప్రవేశపరీక్షలనూ నిర్వహించవచ్చు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని ప్రవేశపరీక్షలను వాయిదావేస్తున్నట్టు అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టుకు వెల్లడించారు. డిగ్రీ, పీజీ కోర్సుల తుది సెమిస్టర్‌ నిర్వహణపై ప్రభుత్వం, ఉన్నతవిద్యామండలి నుంచి వివరాలు తెలుసుకొన్న తర్వాత కోర్టుకు తెలియజేస్తామని పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎంసెట్‌, ఈసెట్‌, పీజీసెట్‌, లాసెట్‌ తదితర ప్రవేశపరీక్షలను వాయిదావేయాలని..గత సెమిస్టర్లలో మార్కుల ఆధారంగా డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ ఫలితాలు విడుదలచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై  చీఫ్‌జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. 

పిటిషనర్‌ తరఫున న్యాయవాది సీ దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పరీక్షల నిర్వహణ వల్ల విద్యార్థులు వైరస్‌ బారినపడే ప్రమాదం ఉన్నదని తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర, ఏపీలోని పలు యూనివర్సిటీలు ప్రవేశపరీక్షలను వాయిదావేశాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. భౌతికంగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని యూజీసీ సైతం తెలిపిందని పేర్కొన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం అన్ని పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ప్రమోట్‌ చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. షార్ట్‌హ్యాండ్‌ వంటి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని కోరలేమని తెలిపింది. 

లాక్‌డౌన్‌ విధిస్తారా?

హైదరాబాద్‌ పరిధిలో లాక్‌డౌన్‌ విధించనున్నట్టు మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తున్నదని.. మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉన్నదా? అని హైకోర్టు ధర్మాసనం అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ప్రశ్నించింది. మంత్రిమండలిలో చర్చించి రెండురోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని ఏజీ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ విధిస్తే ప్రవేశ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ధర్మాసనం మరోసారి ప్రశ్నించడంతో.. దీనిపై చీఫ్‌సెక్రటరీతో చర్చించి వివరాలు వెల్లడిస్తానని, విచారణను మధ్యాహ్నభోజన విరామ సమయానికి వాయిదావేయాలని ఏజీ కోరారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి వాదనలు వినిపిస్తూ అన్ని ప్రవేశపరీక్షలను వాయిదావేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని హైకోర్టుకు వెల్లడించారు. డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, ఆయావర్సిటీల రిజిస్ట్రార్లతో చర్చించాక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. పరీక్షల అంశంపై రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, ఉన్నతవిద్యా మండలికి నోటీసులు జారీచేసింది. ఈ మేరకు విచారణను జూలై 9వ తేదీకి వాయిదావేసింది.

అన్ని సెట్స్‌ ఆగస్టు మొదటివారంలో..

రాష్ట్రంలో వాయిదాపడిన అన్ని ప్రవేశపరీక్షలను ఆగస్టు మొదటివారంలో నిర్వహించాలని యోచిస్తున్నామని, ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. దేశంలో అన్ని ఐఐటీ, ఎన్‌ఐటీలలో 2020-21 విద్యాసంవత్సరంలో సీట్ల భర్తీకోసం జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ-మెయిన్‌, 26న నీట్‌ ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ జరుగనున్నది. ఈ పరీక్షలను ఆయా తేదీల్లోనే నిర్వహిస్తే.. తెలంగాణలోనూ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అదే జరిగితే జాతీయ ఎంట్రన్స్‌లతోపాటు రాష్ట్రంలో ప్రవేశపరీక్షలనూ నిర్వహించే అవకాశం ఉంటుంది. ప్రవేశపరీక్షలు వాయిదాపడితే.. విద్యాసంవత్సరం మొదలు కూడా ఆలస్యంకావడం.. లేదా జీరోఇయర్‌ చేయక తప్పదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రవేశపరీక్షలు వాయిదాపడిన నేపథ్యంలో జూలైలో డిగ్రీ, పీజీ, బీటెక్‌, ఎంటెక్‌ తదితర పరీక్షల నిర్వహణ కష్టమేనని చెప్తున్నారు. ఇప్పటికే ఫైనల్‌ ఇయర్‌ మినహా అన్ని సంవత్సరాల విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. కాగా, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దయ్యే అవకాశాలే అధికంగా ఉన్నట్టు సమాచారం.


logo