మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 16:51:32

9 మృతదేహాలకు శవపరీక్ష పూర్తి.. వీడుతున్న మిస్టరీ

9 మృతదేహాలకు శవపరీక్ష పూర్తి.. వీడుతున్న మిస్టరీ

వరంగల్‌ రూరల్‌ : గీసుకొండ మండలం గొర్రెకుంటలోని బార్‌దాన్‌ గోడౌన్‌ ఆవరణ ఉన్న బావిలో మొత్తం 9 మృతదేహాలు లభ్యమైన విషయం విదితమే. బావిలో మృతదేహాలపై ఇప్పుడిప్పుడే మిస్టరీ వీడుతుంది. ఫోరెన్సిక్‌ ప్రాథమిక నివేదికలో పలు వివరాలు బయటపడుతున్నాయి. వరంగల్‌ ఎంజీఎంలో శనివారం 9 మృతదేహాలకు శవపరీక్ష పూర్తి చేశారు. 

బతికుండగానే బావిలోకి నెట్టి చంపారా? అనే అనుమానాలు తలెత్తున్నాయి. నీట మునగడం వల్లే మరణాలు సంభవించినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది. రెండు మృతదేహాల్లో మాత్రం ఊపిరితిత్తుల్లో నీళ్లు కనిపించలేదు. మత్తులో ఉన్నప్పుడు ఈడ్చుకొచ్చి బావిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాలను ఈడ్చుకువచ్చినట్టుగా వారి శరీరంపై ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఆధారాల కోసం మరోసారి పోలీసులు బావిలోకి దిగి గాలిస్తున్నారు. అన్ని నివేదికలు క్రోడీకరించాకే తుది నిర్ణయానికి రానున్నారు పోలీసులు. మరో రెండు ఫోరెన్సిక్‌ నివేదికల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 

 ఈ కేసులో ఎండీ మక్సూద్‌ కాల్‌డేటా కీలకంగా మారింది. ఆయన కాల్‌డేటా ఆధారంగా ఇద్దరు బీహారీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్‌కుమార్‌ యాదవ్‌, మోహన్‌లను ఘటనాస్థలికి తరలించి పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు ముందు సాయంత్రం 6 గంటల సమయంలో బీహార్‌ యువకులతో మక్సూద్‌ మాట్లాడినట్లు తేలింది. బీహారీ యువకుల వాంగ్మూలం కేసులో కీలకంగా మారనుంది. 

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎండీ మక్సూద్‌ కుటుంబం 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలసొచ్చింది. అయితే బార్‌దాన్‌లోని గోనే సంచుల గోడౌన్‌లో మక్సూద్‌ కుటుంబం పని చేస్తోంది. బావిలో లభ్యమైన మృతదేహాలను మక్సూద్‌(50), ఆయన భార్య నిషా(45), కుమారులు షాబాద్‌(22), సోహైల్‌(20), కుమార్తె బుస్ర(20), బుస్ర కుమారుడు(3), బీహార్‌ చెందిన కార్మికులు శ్యామ్‌(22), శ్రీరామ్‌(20), వరంగల్‌ వాసి షకీల్‌గా పోలీసులు గుర్తించారు. 


logo