ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 01:12:01

పింఛన్లలో చిల్లరకొట్టుడు!

పింఛన్లలో చిల్లరకొట్టుడు!

  • 2016, 3016లో కమిషన్‌గా రూ.16 
  • బలవంతంగా పోస్ట్‌మ్యాన్ల వసూలు 
  • ఈ రూ.16 విలువ రూ.6.07 కోట్లు!

వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన సమ్మయ్య గౌడ్‌ గీత కార్మికుడు. ఈయనకు ప్రతి నెల రూ.2016 పింఛన్‌ వస్తుంది. కానీ పోస్టాఫీసులో వేలిముద్ర వేయించుకొని రూ. 2000 ఇస్తున్నారు. పై రూ.16 అడిగితే.. ‘పెద్దాయనా.. మీకోసం ప్రతి నెల కష్టపడుతున్నా కదా ఆ 16 వదిలేయరాదే’ అన్నారట.

భూపాలపల్లికి చెందిన దివ్య వికలాంగురాలు. ఆమెకు ప్రతి నెల రూ.3016 ఆసరా పింఛన్‌ వస్తుంది. కానీ పోస్టాఫీసులో రూ.3000 మాత్రమే ఇస్తున్నారు. ఒకసారి ఆ రూ.16 కూడా ఇవ్వాలని అడిగినందుకు మరుసటి నెల పింఛన్‌ ఇవ్వకుండా నాలుగైదు నెలలు తిప్పించుకున్నారు.

హైదరాబాద్‌, జనవరి 7 (నమస్తే తెలంగాణ):   రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులను ఆదుకొనే ఉద్దేశంతో ఇస్తున్న పింఛన్లలో కొందరు చిల్లర నొక్కేస్తున్నారు. ప్రభుత్వం అదనంగా ఇస్తున్న రూ.16ను లబ్ధిదారులకు ఇవ్వకుండా తమ జేబుల్లో వేసుకుంటున్నారు. చూడటానికి 16 రూపాయలే కదా అనిపిస్తున్నప్పటికీ.. ఈ మొత్తం కోట్లు దాటుతుందంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎన్నికల అనంతరం వికలాంగులకు రూ.3,016, వృద్ధులు, వితంతువులు, ఇతరులకు రూ.2,016ను పింఛన్‌గా అందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పోస్టాఫీసుల్లో రూ.2,000, రూ.3000 మాత్రమే చెల్లిస్తూ పైన చిల్లర రూ.16ను కమిషన్‌గా తీసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తున్న పింఛన్లలో కేవలం ఈ పై 16 రూపాయలే రూ.6,07,62,560గా ఉంటున్నది.

ఏడాది కిందే ప్రక్షాళన

పింఛన్లు తీసుకుంటున్న వారిలో కొందరు చనిపోయినప్పటికీ వారి పేరుతో ప్రతి నెలా పింఛన్లు తీసుకుంటున్నారు. అలాగే కొన్ని జిల్లాల్లో వందలాది మంది వయసు పరంగా అర్హులు కానప్పటికీ పింఛన్లు పొందుతున్నారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రక్షాళన చేపట్టింది. ఒక్క కరీంనగర్‌ జిల్లాలోనే దాదాపు 1,16,534 మంది అక్రమంగా పింఛన్‌ పొందుతున్నట్టు గుర్తించి వాటిని తొలగించింది. 

వికారాబాద్‌లో ఎమ్మెల్యేకు ఫిర్యాదు

ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లను పోస్ట్‌మ్యాన్లు తమకు పూర్తిగా ఇవ్వడం లేదని వికారాబాద్‌ జిల్లాలోని నవాబుపేట మండలంలో కొందరు నేరుగా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య బుధవారం శుభోదయం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వృద్ధులు తమకు పూర్తిగా పెన్షన్‌ రావడం లేదని చెప్పారు. పోస్ట్‌మ్యాన్‌లు రవాణా చార్జీల కింద రూ.16 మినహాయించుకుంటున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. సదరు పోస్ట్‌మ్యాన్‌లపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు.

పోస్టాఫీసుల్లోనే చిలక్కొట్టుడు

ఆసరా పింఛన్లను పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నారు. బ్యాంకు ఖాతాలో వేసిన డబ్బులను ఇతరులు డ్రా చేసుకునే వీలులేదు. కానీ పోస్టాఫీసుల్లో మాత్రం డబ్బులు చేతికి ఇస్తారు. ఇదే అదునుగా కొందరు చేతివాటం చూపిస్తున్నట్టు పరిశీలనలో తేలింది. రాష్ట్రంలోని మొత్తం 37.97 లక్షల మంది ఆసరా లబ్ధిదారుల్లో 20.72 లక్షల మంది పోస్టాఫీసుల నుంచే పింఛన్లు తీసుకుంటున్నారు. వీరికి వస్తున్న పింఛన్లలో పైన ఇచ్చే రూ.16 విలువ రూ.3,31,52,000 అవుతున్నాయి. ఇందులో 50శాతం నొక్కినా దాని విలువ కోటికి పైనే ఉంటుంది. logo