శనివారం 04 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 17:58:01

కేటీఆర్‌ను విమర్శించే హక్కు రేవంత్‌కు లేదు: పోసాని

 కేటీఆర్‌ను విమర్శించే హక్కు రేవంత్‌కు లేదు: పోసాని

హైదరాబాద్: ప్రతిపక్ష నాయకులు మీడియాలో కాదు..జనం మధ్య ఉండాలని ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి అన్నారు.  ప్రతిపక్ష పార్టీ.. ఓ పార్టీని మిత్రపక్షంగా చేసుకుని పనిచేస్తోందని విమర్శించారు.    రేవంత్‌రెడ్డి రూ.50లక్షలతో పట్టుబడి..కేటీఆర్‌ రాజీనామా చేయాలని అనడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. డబ్బులు ఇస్తూ పట్టుబడిన రాజకీయ నాయకుడు ఎవరూ లేరు..ఒక్క రేవంత్‌ తప్ప అని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలపై  పోసాని మీడియా సమావేశంలో మాట్లాడారు. 

'రేవంత్‌రెడ్డి అక్రమాల గురించి ప్రజలందరికీ తెలుసు. ప్రజల ముందు మాట్లాడే నాయకులకు విశ్వసనీయత ఉండాలి. అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చినా రేవంత్‌రెడ్డి తీరు మారలేదు. రాష్ట్రంలో ప్రతిపక్షం మీడియాలో అబద్దాలు చెబుతోంది. మంత్రి కేటీఆర్‌ వందశాతం నిజాయితీపరుడు. కేటీఆర్‌ గురించి మాట్లాడే హక్కు రేవంత్‌రెడ్డికి లేద'న్నారు. 

'రూ.80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ చాలా గొప్పగా నిర్మిస్తున్నారు. నాగార్జున సాగర్‌ కట్టినప్పుడు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అందరూ మెచ్చుకున్నారు. సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే ప్రతిపక్షాలు గుడ్డిగా విమర్శలు చేస్తున్నాయి. కమీషన్లు తీసుకుంటున్నారంటున్న నేతలు రుజువు చేయగలరా? తెలంగాణలో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయి. తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ప్రజల మంచి కోసం కలిసి పనిచేస్తున్నారు. రెండు రాష్ర్టాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారన్న నమ్మకం ఉందని' పోసాని పేర్కొన్నారు. 


logo