బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 02:59:06

నా పెనిమిటికి పాణం పోసింది సీఎం సారే

నా పెనిమిటికి పాణం పోసింది  సీఎం సారే

  • వైద్యానికి పైసలిత్తడనే దొరికినకాడ అప్పు జేసిన
  • ఇప్పుడు రూ.3.4 లక్షల చెక్కును ఇచ్చిండు
  • పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌తో పేద మహిళ భావోద్వేగం

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: ‘మేం గరీబోళ్లం. కూలీనాలీ చేస్తే గానీ నోటి కాడికి బుక్క పోదు. అలాంటిది నా పెనిమిటికి కోలుకోలేని రోగం అచ్చింది. కానీ సీఎం సారు ఎైట్లెనా పైసలిత్తడు అని తెలిసి అందినకాడికి అప్పు జేసిన. హైదరాబాద్‌ దవాఖానకు తీసుకపోయి రూ.6 లక్షలు ఖర్చు పెట్టి నా భర్తను బతికించుకున్న. సీఎం సారుమీదున్న నమ్మకమే నా పెనిమిటి పాణాన్ని కాపాడింది’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనైందో మహిళ. తన భర్త బతికేందుకు సహాయం అందించారంటూ సీఎం కేసీఆర్‌ను వేనోళ్ల పొగిడింది. సీఎం సహాయనిధి కింద రూ.3,40,000 చెక్కును అందుకుంటూ ఆనందబాష్పాలు రాల్చింది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండ లం జీలపల్లికి చెందిన తిప్పర్తి నరసింహారెడ్డి ఊపిరితిత్తుల సమస్య తో బాధపడేవాడు. పరిస్థితి విషమించటంతో ఆయన భార్య సూర క్క తెలిసినవారి వద్ద అప్పులు చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లి వైద్యం చేయించింది. భారీ మొత్తంలో అప్పు చేయాల్సి రావటంతో సహాయం అందించాలని సీఎం కేసీఆర్‌కు దరఖాస్తు చేసుకొన్నది. దీంతో సీఎం సహాయనిధి నుంచి రూ.3.4 లక్షలు మంజూరైంది. ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును శుక్రవారం మంథనిలో పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు పంపిణీ చేశారు. చెక్కును అందుకుంటూ సూరక్క భావోద్వేగానికి లోనైంది. జెడ్పీ చైర్మన్‌ రెండు చేతులు పట్టుకొని కన్నీటి పర్యంతమైంది. సీఎం కేసీఆర్‌ వల్లే తన భర్త బతికి ఉన్నాడని ఆనందం వ్యక్తం చేసింది.


logo