సోమవారం 25 మే 2020
Telangana - Apr 02, 2020 , 01:32:03

అమ్మా నీకు వందనం!

అమ్మా నీకు వందనం!

  • పెద్ద మనసు చాటిన తుర్కపల్లి పేదింటి మహిళ
  • తనకు వచ్చిన 60 కిలోల బియ్యంలో 30 కిలోలు దానం
  • ఆమె స్ఫూర్తితో 95 క్వింటాళ్లు దానంచేసిన లబ్ధిదారులు 

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆమె పేరు అనురాధ.. నిరుపేద, వితంతువు.. తన ఇద్దరు కుమారులు, కూతురు, కోడలుతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నది. కూలినాలీ చేసుకుని జీవించే తన కుటుంబానికి 60 కిలోల ఉచిత రేషన్‌ బియ్యం వచ్చాయి. కానీ, ఆమె అందులో 30 కిలోలే తీసుకుని.. మిగిలిన 30 కిలోలు రేషన్‌కార్డులేని మరో పేద కుటుంబానికి ఇచ్చేసింది. అక్కడే ఉన్న అడిషనల్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌ కల్పించుకొని.. ‘అయ్యో.. మీదే పేద కుటుంబం కదమ్మా! మీకు వచ్చిన బియ్యం మీరే తీసుకెళ్లండి’ అంటూ సూచించారు. 

అందుకు నిరాకరించిన ఆమె ‘అయ్యా సారూ.. లాక్‌డౌన్‌తో నా కొడుకు వేరే ప్రాంతంలో చిక్కుకుపోయాడు. ఇక్కడ రేషన్‌కార్డు కూడా లేనివాళ్లకు నేను బియ్యం ఇస్తే.. అక్కడ నా కొడుక్కు మరో అమ్మ ఆకలి తీరుస్తది కదా’ అని చెప్పిన సమాధానంతో అడిషనల్‌ కలెక్టర్‌తోపాటు అక్కడ ఉన్న అందరి కండ్లలో నీళ్లు తిరిగాయి. హృదయాలను ద్రవింపజేసిన ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామంలో జరిగింది. అనురాధ స్ఫూర్తితో తుర్కపల్లి గ్రామంతోపాటు శామీర్‌పేట మండల పరిధిలో 95 క్వింటాళ్లను రేషన్‌లబ్ధిదారులు దానంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారని తాసిల్దార్‌ గోవర్దన్‌ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. వీటిని సర్పంచ్‌లకు అందజేసి రేషన్‌కార్డులేని పేదలకు ఇవ్వమన్నట్టు చెప్పారు.


logo