శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 01:34:25

ఇలపై.. అలవైకుంఠపురం

ఇలపై.. అలవైకుంఠపురం

 • గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో పేదల ఇండ్ల నిర్మాణం
 • పైప్‌లైన్‌ గ్యాస్‌ కనెక్షన్‌ సహా సకల సౌకర్యాలు
 • దేశానికే రోల్‌మోడల్‌గా సిద్దిపేట ‘కేసీఆర్‌ నగర్‌'

నలభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో 2460 ఇండ్లు.. సిలిండర్లు లేకుండా పైప్‌లైన్‌తో నిరంతరం సరఫరా అయ్యే గ్యాస్‌ కనెక్షన్‌, నల్లా తిప్పితే 24 గంటలపాటు వచ్చే మంచినీటి వసతి, నాలుగు అడుగులు వేస్తే కూరగాయల మార్కెట్‌, కావల్సిన వస్తువుల కోసం షాపింగ్‌ కాంప్లెక్స్‌, బస్సు సౌకర్యం, పాఠశాల, దవాఖాన, రక్షణకు పోలీస్‌ఔట్‌పోస్టు.. ఇవన్నీ హైదరాబాద్‌ నగరంలోని ధనవంతులు నివసించే గేటెడ్‌ కమ్యూనిటీ కాదు.  ఇవన్నీ సిద్దిపేట జిల్లా నర్సపురంలో పేదల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం ఉచితంగా నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం కాంప్లెక్స్‌లోని వసతులు. కేసీఆర్‌ నగర్‌గా నామకరణం చేసుకున్న ఈ కాలనీ పేదలకు ఇలపై అలవైకుంఠపురం కాకుంటే మరేమిటి..?

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: పేదలకు ప్రభుత్వం నిర్మించే ఇండ్లు అంటే అగ్గిపెట్టెల్లాంటి గదులు, తలకు తగిలే పైకప్పులు, కట్టినా ఏడాదిలోనే ఎప్పుడు కూలిపోతాయో తెలియని దుస్థితిని గతంలో చూశాం.. కానీ, సిద్దిపేట జిల్లా నర్సపురంలో నిర్మించిన ఇండ్లు ఒకసారి చూస్తే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటి పథకంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎగువ మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటులోకి రాని సౌకర్యాలు ఇక్కడ కనిపిస్తాయి. చక్కటి సదుపాయాలతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో నిర్మించిన ఈ ‘కేసీఆర్‌ నగర్‌' దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నది. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుని నిర్మాణాలను పరుగులు పెట్టించారు. వంద కాదు.. రెండొందలు కాదు.. ఏకంగా 400సార్లకు పైగా ఇండ్ల నిర్మాణాల వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం రాత్రింబవళ్లు కష్టపడింది. ఎక్కడా అవినీతి, పక్షపాతం లేకుండా అన్ని రకాలుగా సర్వే చేసి నిజమైన అర్హులను గుర్తించి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రతి ఇంటికీ నిరంతర గ్యాస్‌ కనెక్షన్‌, నీటి వసతి, ఎల్‌ఈడీ లైట్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, కూరగాయల మార్కెట్‌, బస్సు సౌకర్యం, షాపింగ్‌ కాంప్లెక్స్‌, బస్తీ దవాఖాన, పిల్లల పార్కు, గ్రామ దేవతలు, పచ్చని పూలు, పండ్ల మొక్కలతోపాటు వర్షం నీరు ఇంకేలా ఇంకుడు గుంతలు సహా సకల సదుపాయాలు ఉన్నాయి. ఈ నెల 10న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా 144 మందితో సామూహిక గృహప్రవేశాలను చేయించగా.. 17న మరో 180 మంది లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేశారు. ఇలా దశల వారీగా గృహాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు.

లబ్ధిదారుడికి ఐదు సర్టిఫికెట్లు

 • టొరంటో కంపెనీ సహకారంతో ప్రతి ఇంటికి సిలిండర్లు లేకుండా నేరుగా పైపులతో గ్యాస్‌ కనెక్షన్‌ 
 • ప్రతి లబ్ధిదారుడికి ఇంటి పట్టాతోపాటు మున్సిపాలిటీ నుంచి ఇంటి నంబర్‌ సర్టిఫికెట్‌ 
 • ప్రతి ఇంటికి విద్యుత్‌ మీటరు, ఆ ఇంటి యజమాని పేరిట ఆ శాఖ సర్టిఫికెట్‌
 • మున్సిపాలిటీ ఆస్తి పన్ను సర్టిఫికెట్‌, తాగునీటి కనెక్షన్‌ సర్టిఫికెట్‌  

కేసీఆర్‌ నగర్‌ ప్రత్యేకతలు 

 • 45 ఎకరాల విస్తీర్ణంలో 2,460 ఇండ్లను జీ+2 పద్ధతిలో నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో 12 ఇండ్లు.. మొత్తం 205 బ్లాక్‌లు ఉన్నాయి.
 • ఎనిమిది దశల్లో లబ్ధిదారులకు ఇండ్లను అప్పగిస్తున్నారు. తొలిదశలో సీఎం కేసీఆర్‌ 144 ఇండ్లలో గృహప్రవేశాలు చేయించారు. రెండోదశలో 180 మందికి, మూడోదశలో 216 మందికి ఇండ్లను అప్పగించారు. నాలు గోదశలో 168, ఐదో దశలో 192, ఆరో దశలో 168, ఏడో దశలో 132, ఎనిమిదో దశలో 141 మంది లబ్ధిదారులకు ఇండ్లను అప్పగించనున్నారు. వీరందరూ ఈ నెల 31లోగా ఇండ్లలోకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
 • 24 గంటలు తాగునీరు అందుబాటులో ఉండేలా ఓహెచ్‌ఎస్‌ఆర్‌(2) ట్యాంకులు, 5 లక్షల సామర్థ్యం కలిగిన సంప్‌  ఏర్పాటుచేశారు.
 • ఆచార్య జయశంకర్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం. సుమారు 4 వేల మంది కూర్చునేలా చక్కటి సదుపాయాలు కల్పించారు.
 • వర్షం నీటిని ఒడిసి పట్టేందుకు 20 ఇంకుడు గుంతలు సిద్ధం చేశారు.
 • సమీకృత మార్కెట్‌ యార్డు, భూగర్భ డ్రైనేజీ.. పోలీస్‌ ఔట్‌పోస్టు పెట్టారు.
 • బస్తీ దవాఖాన ఏర్పాటు చేయనున్నారు. తాత్కాలికంగా సిబ్బందిని నియమించారు.
 • దుకాణ సముదాయంతోపాటు పిల్లల కోసం పార్కులు ఏర్పాటుచేయగా.. పాఠశాల భవనం నిర్మించనున్నారు.
 • గ్రామ దేవతల మందిరాలు, అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఉండేలా నిర్మాణాలు చేపట్టారు.
 • ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు.


45 ఎకరాలు.. 2,460 ఇండ్లు

సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని నర్సపురం వద్ద 45 ఎకరాల విస్తీర్ణంలో 2,460 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. లబ్ధిదారులు ‘కేసీఆర్‌నగర్‌'గా నామకరణం చేసుకున్నారు. ఇప్పటివరకు 1,341మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి ఎనిమిది దశల్లో ఇండ్లను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిగితా లబ్ధిదారులను తొందరలోనే ఎంపిక చేయనున్నారు. 


logo