మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 00:37:50

పొన్నాల సోదరుడి భూదందా

పొన్నాల సోదరుడి భూదందా
  • హౌసింగ్‌సొసైటీ ప్లాట్లపై పొన్నాల రాంమోహన్‌ కన్ను
  • న్యాయం చేయాలని సీనియర్‌ సిటిజన్ల విజ్ఞప్తి

నయీంనగర్‌: మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య సోదరుడు పొన్నాల రాంమోహన్‌ టీచర్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన లేఅవుట్‌లోని తమ ప్లాట్లను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని సీనియర్‌ సిటిజన్లు ఆరోపించారు. హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం మీడియాతో గోడు వెళ్లబోసుకున్నారు. వరంగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని శాయంపేట జాగీర్‌ గ్రామంలో డీపీ నం.20/92, రివైజ్డ్‌ 31/93లో 29 మంది ప్లాట్లను కొనుగోలు చేశామని, అందులో షెడ్లు, ప్రహరీలు కట్టుకుని ఇంటి నంబర్లను సైతం తీసుకున్నామని చెప్పారు. 


30 ఏండ్ల నుంచి ఆ ప్లాట్లు తమ స్వాధీనంలో ఉన్నాయన్నారు. 2013లో తమ ప్లాట్లపై కన్నేసిన రాంమోహన్‌ రిజిస్ట్రేషన్‌శాఖ అధికారుల సహకారంతో ప్లాట్లను వ్యవసాయ భూమిగా తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడని ఆరోపించారు. చింతల నర్సయ్య మనుమడు చింతల శ్రీనివాస్‌ పేరిట హన్మకొండ రెవెన్యూ అధికారుల సహకారంతో పాస్‌పుస్తకం తీసుకున్నట్టు చెప్పారు. ఇటీవల రాంమోహన్‌ తమ ప్లాట్ల వద్దకు వచ్చి షెడ్లను, ప్రహరీలను కూలగొట్టాడని వాపోయారు. దీనిపై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు  తమకు న్యాయం చేయాలని సీనియర్‌ సిటిజన్లు రాజలింగం, మధు, లక్ష్మారెడ్డి, మాధవి, రాధ, యశోద, రాజ్యలక్ష్మి, పద్మావతి, వినయ్‌, శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.


logo