సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 01:44:25

ఉండీ లేనట్టు.. బహురూపుల కరోనా

ఉండీ లేనట్టు.. బహురూపుల కరోనా

  • పరీక్షలకూ చిక్కని వైరస్‌
  • లక్షణాలున్నా బయటపడని వైరస్‌
  • l ఏ సమస్య లేకున్నా పరీక్షల్లో పాజిటివ్‌
  • l దొంగాట ఆడుతూ ఒకరి నుంచి ఒకరికి
  • l ఎందుకిలా జరుగుతున్నది? ఏం చేయాలి?
  • l జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాయదారి కరోనా మనుషులతో ఆటలాడుకుంటున్నది. లక్షణాలు ఉన్నాయని పరీక్షలు చేయించుకుంటే నెగెటివ్‌ అని వస్తున్నది. నెగెటివ్‌ వచ్చింది కదా అని దర్జాగా ఉంటే కష్టమే సుమా! శరీరంలో ఎక్కడో నక్కిన వైరస్‌.. వేరేవాళ్లకు సోకే ప్రమాదం ఉన్నది. ఇక.. లక్షణాలు లేకున్నా టెస్టులు చేయించుకుంటే పాజిటివ్‌ అని వస్తున్నది. ఏం లక్షణాల్లేవ్‌.. ఇదేంటి? అసలు ఈ పరీక్ష సరిగ్గానే చేశారా? అని అనుమానం వస్తున్నది. నిజం ఏంటో.. అబద్ధం ఏంటో.. తెలియక అయోమయానికి గురి చేస్తున్నదీ మహమ్మారి. అసలు వైరస్‌ ఉన్నదా? లేదా? అనే డౌట్‌ పెట్టి తన పని తాను కానిచ్చేస్తున్నది. సైలెంట్‌గా కొందర్ని చంపేస్తున్నది కూడా. మొత్తంగా ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నది. ఎందుకిలా జరుగుతున్నది? ఏం చేయాలి? అంటే.. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన రాష్ట్రంలో కరోనా సోకినవాళ్లలో 85% మందికి అసలు వైరస్‌ లక్షణాలే లేవట. ఒకవేళ లక్షణాలున్నట్టు తేలితే వెంటనే చికిత్సకు వెళ్లాలని సూచిస్తున్నారు.

అసలు కరోనా ఏం చేస్తున్నది?

కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత గొంతు, ఊపిరితిత్తుల్లోని ఏపిథీలియల్‌ కణాలకు సోకుతున్నది. ఏసీఈ2 గ్రాహకాలను బంధించి శ్వాసక్రియకు విఘాతం కలిగిస్తున్నది. వైరస్‌ వల్ల సంభవించిన మరణాల్లో చాలావరకు గుండె దెబ్బతిని మరణించిన సంఘటనలే ఉన్నాయి. ఎలాంటి లక్షణాలు లేకున్నా ఒక్కసారిగా వైరస్‌ లోడ్‌ పెరిగి చనిపోతున్న ఘటనలు కూడా ఉన్నాయి.

లక్షణాలు తీవ్రంగా ఉంటేనే దవాఖానకు.. 

దగ్గు, గొంతునొప్పి, జ్వరం, విరేచనాలతోపాటు.. రుచి, వాసనను కోల్పోవడం వంటివాటిని కరోనా ప్రాథమిక లక్షణాలుగా డాక్టర్లు చెప్తున్నారు. ఇలాంటి లక్షణాలున్నవారు భయపడాల్సిన అవసరం లేదని, హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు. వీటితోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతినొప్పి, గందరగోళంగా ఉండటం, తీవ్రమైన అలసట వంటి లక్షణాలుంటే కృత్రిమ శ్వాస అవసరం ఉంటుందని చెప్పారు. ఇంట్లోనే కృత్రిమ శ్వాసను అమర్చుకోవచ్చని, దీంతోపాటు తరుచూ రక్తపోటును పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు. బీపీ 90కన్నా దిగువకు పడిపోతూ.. 24 గంటలు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోయినా/ఇంకా దిగజారినా దగ్గర్లోని దవాఖానకు వెళ్లాలని సూచిస్తున్నారు. 

ఎందుకు నెగెటివ్‌ వస్తున్నది?

వైరస్‌ నిర్ధారణ సరిగ్గా జరగకపోవడానికి ప్రధా నంగా రెండు కారణాలున్నాయని ఇన్‌ఫెక్షన్‌ డిసీజెస్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సునీత నర్రెడ్డి తెలిపారు. 1. వైరస్‌ తక్కువ లోడ్‌తో ఉండటం 2. కింది శ్వాసకోశంలో అధికంగా ఉండి, పై శ్వాసకోశంలో లేకపోవడం.

1. వైరస్‌లోడ్‌ తక్కువగా ఉండటం: రోగిలో వైరస్‌ తొలిగిపోయినా, అసమానంగా ఉన్నా, తక్కువ లోడ్‌తో ఉన్నా నిర్ధారణ పరీక్షల్లో ఒకసారి నెగెటివ్‌ అని, మరోసారి పాజిటివ్‌ అని వస్తున్నది.

2. పైశ్వాసకోశంలో వైరస్‌ లేకపోవటం: వైరస్‌ పైశ్వాసకోశంలో లేకుండా, కింది శ్వాసకోశంలో అధికలోడ్‌తో ఉంటే సరైన ఫలితాలు రావు. సాధారణంగా కరోనా పరీక్షకు పైశ్వాసకోశం నుంచి నమూనాలు సేకరిస్తారు. కింది శ్వాసకోశంలో దాగున్న వైరస్‌ పరీక్షల్లో బయటపడదు.

పరీక్షల్లో తేడాలు: వైరస్‌ నిర్ధారణకు వివిధ రకాల పద్ధతులున్నాయి. అందులో ఆర్‌టీపీసీఆర్‌, రాపిడ్‌ యాంటీజెన్‌ అనేవి రెండు పద్ధతులు. వీటిలో పీసీఆర్‌ పూర్తి కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. రాపిడ్‌ యాంటీజెన్‌ 84% కచ్చితత్వంతో ఫలితాలను ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో యాంటీజెన్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా పీసీఆర్‌ చేయాల్సి ఉంటుంది. పీసీఆర్‌ చేస్తే పాజిటివ్‌ వచ్చే అవకాశం లేకపోలేదు.

సీటీ స్కాన్‌తో సత్ఫలితాలు: కొంతమందికి నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్‌ వస్తున్నది. అలాంటివాళ్లు సీటీ స్కాన్‌ చేయించుకుంటే ఫలితం ఉంటుందని డాక్టర్‌ సునీత తెలిపారు. సీటీ స్కాన్‌ ద్వారా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఇన్ఫెక్షన్‌కు కరోనా వైరస్‌ కారణమా? కాదా? అన్నది తెలుసుకొనే వీలుంటుందని వివరించారు.

సరైన పద్ధతిలో శాంపిల్‌ సేకరించాలి శాంపిల్‌ సేకరణలో జాగ్రత్త వహించాలి. ముక్కు నుంచి స్వాబ్‌ను తీసేప్పుడు లోపలి భాగం నుంచి తీయాలి. పైపైన తీయడం వల్ల నిర్ధారణ అయ్యే అవకాశం తక్కువ. లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్న వారిలో ముక్కు, నోటి స్వాబ్‌లో వైరస్‌ ఎక్కువగా ఉండదు. అందుకే శాంపిల్‌ ముక్కు, నోరు.. రెండింటి నుంచి స్వాబ్‌ తీసుకొని పరీక్షలు నిర్వహిస్తే ఫలితాల్లో కచ్చితత్వం ఉంటుంది. 

డాక్టర్‌ కే మధుమోహన్‌రావు, నిమ్స్‌ ఆర్‌అండ్‌డీ విభాగాధిపతి

లక్షణాలుంటే జాగ్రత్తలు తప్పనిసరి  

కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్‌/పాజిటివ్‌ ఫలితంతో సంబంధం లేకుండా.. లక్షణాలుంటే జాగ్రత్తపడాలని వైద్యులు సూచిస్తున్నారు. వెంటనే చికిత్సకు ఉపక్రమించాలని చెప్తున్నారు. లక్షణాలున్నా పరీక్షల్లో తేడా వస్తుండటాన్ని సీరియస్‌గా పరిగణించాలని వెల్లడించారు. కాగా, లక్షణాలు మూడురకాలు. జలుబు, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు 85% మందిలో ఏర్పడుతున్నాయి. విరేచనాలు, రుచి కోల్పోవటం లాంటి లక్షణాలు 5% మందిలో తెలుస్తున్నాయి. చివరగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడేవాళ్లు 10% ఉన్నారు. ఈ దశ అతితీవ్రమైనది. ఎక్కువ మరణాలు చోటుచేసుకుంటున్నది వీరికే.

ధైర్యమే అసలు మందు

కరోనా నుంచి వేలమంది కోలుకొని ఇంటికి వెళ్తున్నారని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. మరణాల రేటు తెలంగాణలో ఒక్కశాతం లోపే ఉన్నదని గుర్తుచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 5% వరకే ఉన్నదన్నారు. ధైర్యంగా ఉండటమే అసలైన మందని చెప్తున్నారు.

ఆరు వర్గాలుగా విభజించి, చికిత్స 

1. విడువని దగ్గు, కండరాల నొప్పులు ఉన్నవారు. వీరిలో ఒక్కశాతం మందికి మాత్రమే కృత్రిమ శ్వాస అవసరం.

2. దగ్గు, గొంతునొప్పి, జ్వరం, రుచి, వాసన శక్తిని కోల్పోవడం. 

ఇలాంటివారిలో 4% మందికి కృత్రిమ శ్వాస అవసరం. 

3. డయేరియా వంటి జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారు. వీరిలో 3% మంది కృత్రిమ శ్వాస అవసరం. 

4. తీవ్ర అలసట, విడువకుండా ఛాతి నొప్పి, దగ్గు. వీరిలో 10% మందికి ప్రమాదం పొంచి ఉంటుంది. 

5. అలసట, గందరగోళంగా ఉండేవారిలో 15% మందికి కృత్రిమ శ్వాస అవసరం. 

6. తీవ్ర శ్వాస సమస్యలు, ఊపిరి సరిగా పీల్చుకోలేకపోవడం, ఛాతిలో నొప్పి, గందరగోళంగా ఉండటం, అలసట వంటి లక్షణాలు కనిపించడం. వీరిలో 25% మందికి కృత్రిమ శ్వాస అవసరం. 


logo