శనివారం 11 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 21:50:29

కష్టకాలంలో రాజకీయాలా? : మంత్రి ఎర్రబెల్లి

కష్టకాలంలో రాజకీయాలా? : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : కష్టకాలంలో రాజకీయాలు చేస్తారా? అంటూ ప్రతిపక్షాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. ఆరో విడత హరితహారంలో భాగంగా వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, కుడా చైర్మన్‌ యాదవరెడ్డి, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావుతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ఆపత్కాలంలో ప్రతిపక్షాలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు ఎవరికి చేస్తున్నాయి? అసలు వాళ్లు పదవుల్లో ఉన్నప్పుడు ఏం చేశారు? అని ప్రశించారు. వాళ్లు ఏం చేయకపోవడంతోనే ఇప్పుడు ఇంత చేయాల్సి వస్తుందన్నారు. హరితహారం తెలంగాణ కోసం కాదా? అంటూ ప్రతి పక్షాలను ప్రశ్నించారు. ప్రతిపక్షాల కోసం ప్రజాభివృద్ధిని వదలబోమని, వాళ్ల విమర్శలకు వెరవమని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసి తీరుతామన్నారు. వారం రోజుల్లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా వరంగల్‌ నగర సమగ్ర అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ను ఆమోదం పొందుతామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.


logo