శనివారం 04 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:51:44

దారిచూపిన గురువు రామానంద తీర్థ

దారిచూపిన గురువు రామానంద తీర్థ

హైదరాబాద్‌ సంస్థానం విముక్తి కోసం పోరాడిన స్వామి రామానంద తీర్థ.. పీవీ నరసింహారావుకు రాజకీయ గురువు. సన్యాసాశ్రమం స్వీకరించి సమాజమనే పెద్ద సంసార బాధ్యతలను చేపడితే, ఆయన శిష్యుడిగా పీవీ సొంత సంసార బాధ్యతలను వదలకుండానే మనఃసన్యాస స్థితిని సాధించి రాజకీయ జీవితంలో ఎదురైన ఒడుదొడుకులను స్థితప్రజ్ఞతో, వైరాగ్యభావనతో ఎదుర్కొన్నారు. రామానంద తీర్థ ప్రభావం పీవీపై చాలానే ఉంది. స్వామి రామానంద తీర్థ 61వ జన్మదిన సందర్భంగా పీవీ ఏమన్నారంటే  ‘నా సంపూర్ణ భక్తి ప్రపత్తులను స్వీకరించిన వారిలో స్వామీ రామానందతీర్థ ఒకరు. 

ఈ మహోన్నత వ్యక్తి గురించి పరిశీలించేప్పుడు నిష్పక్షపాత వైఖరి నాకు కష్టసాధ్యం’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పీవీపై స్వామీజీ ప్రభావానికి అద్దం పట్టాయి. రామానంద తీర్థది స్వరూప స్వభావానికి భిన్నమైన మహోన్నత న్యాయకత్వమని పీవీ అంటుండేవారు. స్వామీజీ పుట్టింది కర్ణాటకలో, విద్యాభ్యాసం సాగింది మహారాష్ట్రలో, రాజకీయ జీవితం ఉన్నత శిఖరాలను అందుకొన్నది మాత్రం తెలంగాణలోనేని పీవీ చెప్పేవారు. 

‘తెలంగాణ సమస్యల పరిష్కారానికే స్వామీజీ తన జీవితంలో అత్యధిక సమయాన్ని వెచ్చించారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన ప్రత్యేకం. ఆయన నుంచి ప్రేరణ పొందిన నాలాంటి రాజకీయ కార్యకర్తలకు ఆయన కేవలం నాయకుడే కాదు. ఒక ప్రతీక. శక్తి. దీపస్తంభం, ఒక సంస్థ’ అని పీవీ పేర్కొనేవారు. ఎంతో మంది రాజకీయ నాయకులు, స్వామీజీలు, ఉపన్యాసకులు, త్యాగాలు చేసినవారు, బాధలు అనుభవించినవారు ఉన్నా.. వారందరు ఒక ఎత్తు, స్వామీజీ ఒక ఎత్తు అని అనడంలో సందేహం లేదని కుండబద్దలుకొట్టేవారు. పీవీకి స్వామీజీ అంటే అంత అభిమానం.


logo