e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home Top Slides కుర్చీ కోసం కల.. రాజకీయ క్రీడల్లో సమిధలవుతున్న చిన్నారులు

కుర్చీ కోసం కల.. రాజకీయ క్రీడల్లో సమిధలవుతున్న చిన్నారులు

 • కాంగ్రెస్‌, బీజేపీ అరాజకీయం
 • సీఎం, ప్రభుత్వంపై నిందలు వేయిస్తూ వీడియోలు
 • చిన్నారులకు ఫోన్లు కొనిచ్చి చిల్లర నాయకుల దుర్మార్గం
 • తల్లిదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త అంటున్న నిపుణులు
 • చిన్నారులైనా కేసులు తప్పవని పోలీసుల హెచ్చరిక

సైదాబాద్‌లో చిన్నారిపై లైంగికదాడి ఘటన తర్వాత ఓ బాలుడు సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో తిడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్నది. స్వయంగా కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు చెందిన ‘పొన్నం ప్రభాకర్‌ యువసేన’ సోషల్‌ మీడియా అకౌంట్‌పైనే దీన్ని వైరల్‌ చేస్తున్నారు.

సీఎం కేసీఆర్‌పై నకిలీ పోస్టర్‌ను తయారుచేసి తీన్మార్‌ మల్లన్న ఫ్యాన్స్‌ గ్రూప్‌ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ బాలుడితోపాటు మరో వ్యక్తిపై నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, సైబర్‌ క్రైం పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసు పెట్టి, అరెస్టు చేశారు. విషయం ఏంటంటే సదరు బాలుడు ప్రభుత్వ బీసీ సంక్షేమ హాస్టల్‌లో ఉండి చదువుకుంటూ, ఎవరో ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పైనే విమర్శలు చేస్తూ తన అమాయకత్వాన్ని బయటపెట్టుకున్నాడు.

- Advertisement -

దినేశ్‌ (పేరు మార్చాం) చదివేది ఆరో తరగతి. పొద్దున లేచింది మొదలు స్మార్ట్‌ఫోన్‌ చేతిలో లేకుండా నిమిషం కూడా ఉండలేడు. తల్లిదండ్రులు అడిగితే ఆన్‌లైన్‌ క్లాస్‌ అని చెప్పేవాడు. చేసేది మాత్రం ఆన్‌లైన్‌లో అడ్డగోలుగా పోస్టులు పెట్టడం. కొందరి మితిమీరిన ప్రోత్సాహంతో సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వాన్ని తిట్టుడు మొదలు పెట్టిండు. తీరా పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో విషయం తెలిసి బాలుడి తల్లిదండ్రులు నెత్తినోరు బాదుకొన్నారు. బాలుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అతడి పేరిట ఏకంగా 56 ఫేక్‌ సోషల్‌ మీడియా అకౌంట్లు ఉండటంతో పోలీసులే నివ్వెరపోయారు.

సోషల్‌ మీడియా.. 21వ శతాబ్దంలో అత్యంత విజయవంతమైన సమాచార విప్లవం. ప్రపంచాన్ని ఒక్కదగ్గరకు చేర్చిన మాధ్యమం. ఇదో విజ్ఞాన గని. శక్తిమంతమైన ప్రచార వారధి. మన రాష్ట్రంలో మాత్రం విపక్షాలు సోషల్‌మీడియా అర్థాన్నే మార్చేస్తున్నాయి. పవర్‌ పాలిటిక్స్‌ కోసం, వ్యక్తిగత స్వార్థంకోసం సోషల్‌ మీడియా అంటే ఒక తిట్టు, అపచారం, అనాచారం అనే స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు సామాన్యులు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటి మాధ్యమాలను చూడాలంటేనే భయపడే స్థాయికి తెచ్చాయి. వికృత రాజకీయాలు చేస్తూ అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని చిన్న పిల్లలతో అసభ్యంగా తిట్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నాయి.

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (నమస్తే తెలంగాణ): చిన్న పిల్లలపై అయితే కేసులు ఉండవని, విదేశాల్లో ఉన్నవారైతే ఇక్కడి పోలీసులు కేసులు పెట్టలేరని, తాగుబోతులతో తిట్టిస్తే ఎవరూ పట్టించుకోరన్న దుష్ట పన్నాగాలకు, నీచ రాజకీయాలకు ప్రతిపక్షాలు తెరతీస్తున్నాయి. పిల్లలకు డబ్బులు ఎరగా చూపి, లేదంటే వారి ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా తీసుకొని సోషల్‌మీడియా వేదికగా దుర్మార్గ ప్రచారం చేయిస్తున్నాయి. ఇలాంటి ప్రచారం శృతిమించటంతో గతంలో కరీంనగర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. అలాంటి వీడియోలనే విపక్ష నేతలు మళ్లీ తెరపైకి తెస్తున్నారు. స్వయంగా కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేరిట ఉన్న ‘పొన్నం ప్రభాకర్‌ యువసేన’ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోనూ ఓ బాలుడి చేత సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులను, ప్రభుత్వాన్ని తిట్టిస్తూ తీసిన వీడియోను వైరల్‌ చేస్తున్నారు. ఇలాంటి ధోరణలు పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తాయని, వారిని జువెనైల్‌ హోంల పాలుచేస్తాయని పోలీసులు చెప్తున్నారు. చిన్నప్పటి నుంచే విద్వేషభావాలను పిల్లల మనసులలో నాటడంవల్ల వారి వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, వారి రోజువారీ పనులపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.

సమిధలుగా చిన్నారులు
బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు, వారి సోషల్‌ మీడియా అకౌంట్ల నిర్వాహకులు కొందరు చిన్నారులతో పనికట్టుకొని ఇలాంటి వీడియోలు తీయిస్తున్నట్టు తెలుస్తున్నది. పార్టీ కార్యకర్తలు, నాయకులైతే పోలీస్‌ కేసులు అవుతాయన్న భయంతో చిన్నారులను వాడుకొంటున్నట్టు విమర్శలు వస్తున్నాయి. 18 ఏండ్లు నిండనివారికి సోషల్‌మీడియాలో అకౌంటే ఉండరాదని చట్టం చెప్తున్నా, పోతే పిల్లలే బలైపోతారులే అన్న నిర్లక్ష్యధోరణితో కొందరు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. చిన్నవాళ్లయినా, పెద్దవాళ్లయినా తప్పు చేస్తే శిక్ష తప్పదన్న సోయిలేని నేతల వల్ల అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులు సమిధలవుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదుచేసిన బాలుడి తండ్రి సాధారణ రైతు. రైతుబంధు సహా అన్ని ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుడు. కేసు నమోదుచేసి, పోలీసులు పిలిచేవరకు కొడుకు ఇలాంటి వీడియోలు చేసిన విషయం తనకు తెలియదని, దయచేసి కొడుకు జీవితాన్ని కాపాడాలని వేడుకొన్నాడు.

ఫోన్లు కొనిపెడుతూ? సెల్ఫీలతో రెచ్చగొడుతూ..
కొందరు విపక్ష నేతలు పిల్లలకు ఫోన్లు కొనిపెడుతూ వారిని పావులుగా వాడుకొంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల సైబర్‌ క్రైం పోలీసుల వద్దకు ఇలాంటి ఓ కేసు వచ్చింది. పిల్లవాడి ఫోన్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పలుసార్లు దిగిన సెల్ఫీలు ఉన్నాయి. ఫొటోలు, వీడియోల మార్ఫింగ్‌కు సంబంధించిన యాప్స్‌ ఉన్నాయి. ‘వాళ్లు గవర్నమెంట్‌ను తిడుతున్నారు కాబట్టి మేం కూడా అలా తిడితే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యి, క్రేజ్‌ వస్తుందని ఇలా చేశాను’ అని ఆ బాలుడు విచారణలో చెప్పడం పోలీసులను నివ్వెరపర్చింది. అవసరమైతే తమకు ‘ఆ నేతలు’ ఫోన్లు కూడా కొనిస్తారని
ఆ బాలుడు చెప్పినట్టు తెలిసింది.

పనిగట్టుకొని ప్రచారం
సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని బూతులు తిట్టిన పిల్లలను గొప్ప పని చేశారని పొగుడుతూ కొందరు నేతలు, ఆ వీడియోలను తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో పెట్టుకొంటున్నారు. ఇదే తరహాలో ఓ బహిరంగసభలో తాను చెప్పే తప్పుడు మాటలకు వంతపాడేలా ఓ చిన్నారిని రెచ్చగొట్టి ఆ వీడియోను ఎంపీ అరవింద్‌ బ్యాచ్‌ తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో వైరల్‌ చేసింది. అది చాలదన్నట్టు ఆ పిల్లవాడితో కలిసి భోజనం చేసి, ఆ వీడియోను కూడా సోషల్‌మీడియాలో పెట్టుకొన్నారు. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ యువసేన అకౌంట్‌లో వైరల్‌ చేసిన వీడియోలో కావాలనే ప్రశ్నలు అడుగుతూ ఆ బాలుడిని రెచ్చగొడుతున్నట్టు స్పష్టంగా ఉన్నది.

గొప్పవాళ్లను గౌరవించే పద్ధతి లేదా?
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పోరాటయోధుల గురించి మనదేశంలో ఎక్కడైనా పిల్లలకు పాఠశాలలో ఓనమాలు నేర్చే సమయం నుంచి గొప్పగా బోధిస్తాం. గాంధీ పేరు చెప్పగానే ఏ విద్యార్థి అయినా జాతిపిత అని ఠక్కున చెప్తారు. మరి దశాబ్దాలపాటు నానా కష్టాలూ పడి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్‌ గురించి మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం? పవర్‌ పాలిటిక్స్‌ కోసం కొందరు చిల్లర నేతలు సీఎం కేసీఆర్‌పై పిల్లల మెదళ్లలో విషబీజాలు నాటుతున్నారు. రాష్ర్టాన్ని సాధించిన మహానుభావుడిని గౌరవించేది ఇలాగేనా? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.

తల్లిదండ్రులూ ఈ జాగ్రత్తలు తీసుకోండి

 • మీ పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు.. ఎలాంటి వెబ్‌సైట్లు, యాప్‌లు వాడుతున్నారు అన్నది కనిపెడుతూ ఉండాలి. వారికి సరైన మార్గనిర్దేశం చేయాలి.
 • ఇతరులను కామెంట్‌ చేయడం, వ్యక్తులు, వ్యవస్థలను కించపర్చేలా మాట్లాడటం మంచిదికాదని పిల్లలకు అవగాహన కల్పించాలి.
 • సోషల్‌ మీడియా వ్యసనపరులు కాకుండా చూసుకోవాలి.
 • రాజకీయాలు, మతపరమైన అంశాలు, వ్యక్తిగత దూషణలు నేరమని స్పష్టంగా చెప్పాలి.
 • కంప్యూటర్‌లో పేరెంట్‌ కంట్రోల్స్‌ ఆన్‌లో పెట్టాలి. సేఫ్‌ సెర్చ్‌ ఆప్షన్‌ పెట్టుకోవాలి. ప్రత్యేకమైన వెబ్‌సైట్లు, యాప్స్‌ బ్లాక్‌ చేయాలి.
 • అపరిచితుల ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు, కొత్త కాంటాక్ట్‌ నంబర్ల నుంచి వచ్చే రిక్వెస్ట్‌లు అంగీకరించకుండా జాగ్రత్తలు నేర్పాలి.
 • ఇంటర్నెట్‌, మొబైల్‌ వాడకానికి టైం లిమిట్‌ పెట్టాలి.

తిట్టేటోడికే వ్యూస్‌ ఎక్కువ
మనదేశంలో న్యూసెన్స్‌ వాల్యూ ఎక్కువ ఉన్నవాటికే మీడియాలో ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. నిర్మాణాత్మకంగా ఉన్నవాటికి చాలా తక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
-నితిన్‌ గడ్కరీ, కేంద్రమంత్రి

ఆదిలోనే అడ్డుకోవాలి
ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఎంతో అమూల్యమైంది. అలాంటి వయస్సులో కొందరు స్వార్థపరులు చిన్నారుల మనసుల్లో విషాన్ని నింపే ప్రయత్నం చేయడం బాధాకరం. ఇలాంటివి వ్యవస్థీకృతంగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఈ ధోరణులు ఆదిలోనే అరికట్టకపోతే సమాజానికి ముప్పు తప్పదు. తల్లిదండ్రులు తమ పిల్లలు పెట్టే పోస్టుల్లో కుల,మత, ప్రాంత విద్వేషాలకు సంబంధించినవి ఉన్నట్టు గమనిస్తే వెంటనే సరిదిద్దాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.
-సుధీర్‌కుమార్‌, సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌

చిన్నారులైనా కేసులు తప్పవు
సోషల్‌ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు, అసభ్యకరమైన పోస్టులు, మార్ఫింగ్‌ చిత్రాలు, వీడియోలు పెట్టేవారిపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయి. ఈ విషయంలో పిల్లలైనా, పెద్దలైనా ఒకే సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తాం. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇలాంటి కేసులలో ఐటీ యాక్ట్‌ 67, 67(ఏ) కింద కేసులు నమోదు చేస్తున్నాం. మొదటి సెక్షన్‌ కింద మూడేండ్లు, రెండో సెక్షన్‌ కింద ఐదేండ్లవరకు శిక్ష తప్పదు. పిల్లలపై నేరం రుజువైతే బోస్టన్‌ స్కూల్లో వేస్తారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. -కేవీఎం ప్రసాద్‌, సైబర్‌ క్రైం ఏసీపీ

పిల్లల మెదళ్లలో విషబీజాలు నాటుతున్నారు
అభిప్రాయాలు పంచుకొనే అత్యద్భుత వేదిక సోషల్‌ మీడియా. దీని ద్వారా అనేక అంశాలను సమాజానికి చెప్పవచ్చు. కానీ కొన్ని రాజకీయపార్టీలు చిన్న పిల్లల్ని వాడుకొని, లోకం పోకడ తెలియని వాళ్ల మెదళ్లలో విషబీజాలు నాటుతున్నాయి. పదుల సంఖ్యలో ఫేక్‌ ఐడీలు సృష్టించి తప్పుడు పోస్టులు పెట్టించి కేసులపాలయ్యే స్థితికి తెస్తున్నాయి. నిరుపేదల పిల్లలే ఎక్కువగా ఇందులో ఇరుక్కొంటున్నారు. ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత నింపుతూ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం బాధాకరం. -అక్షయ్‌, సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌

మంచి భవిష్యత్తు ఎలా సాధ్యం?
మన సమాజంలో గొప్పగొప్ప రాజకీయనాయకులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలంతా చిన్నప్పుడు ఉన్నత విలువలతో పెరిగినవారే. అలాంటి బాల్యాన్ని ఇప్పుడు మనం పిల్లలకు అందించగలుగుతున్నామా? చిన్నప్పటి నుంచే వాళ్లు తప్పుడు దారిలోకి వెళితే భవిష్యత్తులో చిక్కులు తప్పవు. మేం అమెరికాలోని అట్లాంటాలో ఉంటాం. ఇక్కడి చట్టాల ప్రకారం చిన్న పిల్లలతో వారి తల్లిదండ్రులు, టీచర్ల సమక్షంలోనే మూడో వ్యక్తి ఎవరైనా మాట్లాడాలి. లేదంటే చట్టపరంగా చర్యలుంటాయి. అమెరికా, యూరోపియన్‌ దేశాల్లో ఒక వయస్సు వచ్చే వరకు పిల్లలకు ఎంతో రక్షణగా చట్టాలు ఉంటాయి. మన దేశంలో ఆ పరిస్థితి రావాలి. వాళ్ల భవిష్యత్తు కోసం మంచి పునాదులు వేయాలి.
-పొద్దుటూరి నిరంజన్‌, సోషల్‌ యాక్టివిస్ట్‌, అట్లాంటా, యూఎస్‌ఏ.

పిల్లల భవిష్యత్తుపై పెను ప్రభావం
పిల్లలు పెరిగే వాతావరణం, చుట్టూ ఉండే పరిస్థితులు వారి భవిష్యత్తుపై ఎంతో ప్రభావం చూపుతాయి. తల్లిదండ్రుల జీన్స్‌ నుంచి 15-20 శాతం గుణాలు వస్తే. మిగిలిన 80% వారి చుట్టూ ఉండే మనుషుల ప్రభావం, పరిస్థితుల కారణంగా అబ్బుతాయి. ద్వేషపూరిత వాతావరణంలో పెరిగితే వాళ్లు అదే మాదిరిగా తయారవుతారు. ఇది సమాజానికి ఎంతో ప్రమాదకరం. కొందరు నేతలు వాళ్ల లక్ష్యాల కోసం పిల్లల్లో విద్వేషాలు రెచ్చగొడితే క్షమించరాని నేరంగా పరిగణించాలి. మైనర్లకు బైక్‌లు ఇస్తే తల్లిదండ్రులపై ఎలాగైతే కేసులు నమోదు చేస్తున్నారో, అదేవిధంగా సోషల్‌ మీడియాలో పిల్లలు పెట్టే అడ్డగోలు పోస్టుల విషయంలో తల్లిదండ్రులను బాధ్యులను చేయాలి. అప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై దృష్టి పెడతారు. -చెన్నోజు వీరేందర్‌, సైకాలజిస్ట్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement