గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:20:26

ఐటీ.. లుక్‌ ఈస్ట్‌!

ఐటీ.. లుక్‌ ఈస్ట్‌!

  • హైదరాబాద్‌ తూర్పు దిక్కున వేగంగా విస్తరణ
  • అందుబాటులో 25 లక్షల చదరపు అడుగుల స్పేస్‌
  • ప్రత్యక్షంగా 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
  • నలువైపులా పెట్టుబడుల ఆకర్షణకు గ్రిడ్‌ పాలసీ
  • సమీక్షలో ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు

లుక్‌ఈస్ట్‌లో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్‌, మల్లాపూర్‌, నాచారం తదితర ప్రాంతాల్లో ఐటీ పార్కులు రాబోతున్నాయి. ఐటీ పరిశ్రమలను తూర్పు దిక్కునకు తరలించే ప్రయత్నంలో భాగంగా అవసరమైన ప్రోత్సాహకాలతోపాటు మౌలిక వసతులు కల్పిస్తాం. నగరం నలువైపులా పెట్టుబడుల ఆకర్షణకు త్వరలో గ్రిడ్‌ పాలసీని తీసుకురానున్నాం.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ తూర్పువైపు ఐటీ పరిశ్రమలను వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఉప్పల్‌, మల్లాపూర్‌, నాచారం తదితర ప్రాంతాల్లో ఐటీ పార్కులు రాబోతున్నాయని పేర్కొన్నారు. నగరం నలువైపులా పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌ గ్రోత్‌ ఇన్‌ డిస్పర్షన్‌ (గ్రిడ్‌) విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్టు ప్రకటించారు. బుధవారం గ్రిడ్‌పై సమీక్షలో భాగంగా మంత్రి కేటీఆర్‌.. ఐటీ కంపెనీల ప్రతినిధులు, వివిధశాఖల అధికారులతో ఉప్పల్‌ ఎన్‌ఎస్‌ఎల్‌ ఐటీ సెజ్‌లో సమావేశమయ్యారు. 

ప్రస్తుతం ఉన్న ఐటీ కంపెనీలతోపాటు భవిష్యత్‌లో రానున్న కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలపై సమాలోచనలు చేశారు. ఐటీ, దాని అనుబంధ కంపెనీలను హైదరాబాద్‌ నలుమూలలకు విస్తరించేందుకు అవసరమైన గ్రిడ్‌ పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ముందుకు రానున్నట్టు మంత్రి తెలిపారు. ఈ పాలసీ ద్వారా నలువైపులా పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు. ఐటీ పరిశ్రమలను తూర్పు హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నంలో భాగంగా తగిన ప్రోత్సాహకాలతోపాటు మౌలిక వసతులను కల్పిస్తామని ప్రకటించారు. రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా అభివృద్ధిచేసేందుకు అవసరమైన కన్వర్షన్‌ పత్రాలను 5 కంపెనీల ప్రతినిధులకు అందజేశారు. ఈ ఐదు కంపెనీలు సుమారు 25 లక్షల చదరపు అడుగుల ఐటీ పార్కులు లేదా కార్యాలయాలకి అవసరమైన ఆఫీస్‌ స్పేస్‌ను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. తద్వారా ఉప్పల్‌ ప్రాంతంలో మరో 30 వేల మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఏర్పడుతుందన్నారు. 


జాతీయ సగటు కన్నా అధికంగా వృద్ధి

గత ఐదేండ్లలో తెలంగాణ ఐటీ పరిశ్రమ జాతీయ సగటు కన్నా అధికంగా వృద్ధి చెందుతూ వస్తున్నదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర పభుత్వం తీసుకొస్తున్న గ్రిడ్‌ విధానంతో ఐటీ పరిశ్రమలు నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయన్న నమ్మకం ఉన్నదని చెప్పారు. ఇప్పటికే ఉప్పల్‌ ప్రాంతంలో అందుబాటులో ఉన్న మెట్రో, శిల్పారామం, మూసీ నది అభివృద్ధి.. వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక మౌలికవసతులు పెరుగుతున్నాయని వివరించారు.

ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌వైపు, అంబర్‌పేట్‌ రామంతాపూర్‌వైపు ఫ్లైఓవర్ల ద్వారా రోడ్లు అనుసందానం మరింత మెరుగు పడనున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే నగరం నలువైపులా ఐటీ పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్‌, ఏరో స్పేస్‌, మెడికల్‌ డివైజ్‌ పార్క్‌ వంటి వివిధ రకాల పరిశ్రమలు విసర్తించి ఉన్నాయని తెలిపారు. ఔటర్‌ రింగ్‌రోడ్‌ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలు దూర ప్రాంతాలకు తరలివెళ్తే.. ఆ స్థలాలను ఐటీ రంగ కార్యాలయాల అభివృద్ధికి ఇచ్చే విషయాన్ని పభుత్వం పరిశీలిస్తుందన్నారు. రానున్న రోజుల్లో తూర్పు హైదరాబాద్‌వైపు మరిన్ని ఐటీ పరిశ్రమలు వస్తాయన్న నమ్మకం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రాచకొండ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సమాచార సంచికను మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


logo