బుధవారం 03 జూన్ 2020
Telangana - May 10, 2020 , 02:24:20

ఇంటిముఖం చూడని పోలీసన్న!

ఇంటిముఖం చూడని పోలీసన్న!

  • కుటుంబానికి దూరంగా.. విధుల్లో బాధ్యతగా
  • అద్దె గదులు, ఠాణాలు, ఫంక్షన్‌హాళ్లలో నివాసం
  • కరోనా కట్టడిలో తెలంగాణ పోలీస్‌ కమిట్‌మెంట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రోడ్డుపై డివైడరే డైనింగ్‌ టేబుళ్లు.. ఫంక్షన్‌హాలే పడకగది.. ఎండలు మండినా, వడగండ్ల వాన కురిసినా.. దొరికిన బుక్కెడు తింటూ భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ విధులతోనే మమేకమవుతున్నారు తెలంగాణ పోలీసులు.. లాక్‌డౌన్‌ మొదలు ఇంటిముఖం కూడా చూడకుండా కరోనా కట్టడిలో కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నారు. 

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి 47 రోజులుగా దాదాపు 500 నుంచి 600 మంది పోలీస్‌ సిబ్బంది, అధికారులు ఇంటిముఖం చూడకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధానంగా కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ దవాఖాన, ప్రభుత్వ కార్వంటైన్‌ సెంటర్లు, రెడ్‌జోన్లు, కంటైన్మెంట్‌ జోన్లలో పనిచేస్తున్నారు. ఎస్పీ స్థాయినుంచి హోంగార్డు వరకు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ.. తమకు కరోనా సోకితే ఆ ప్రభావం కుటుంబంపై ఎక్కడపడుతుందోనన్న ఆందోళనతో ఇండ్ల ముఖం చూడటంలేదు. కొందరు కుటుంబాలను అత్తగారి ఇండ్లకు పంపించేశారు. విధులకు దగ్గరలోని ఫంక్షన్‌హాళ్లు, హోటళ్లు, అద్దె గదుల్లో, అదీ కుదరకపోతే పోలీస్‌స్టేషన్‌ ఆవరణల్లోనే నిద్రపోతున్నారు. ఫ్యామిలీ ఉండి బ్యాచిలర్‌గా మారారు. విరామ సమయంలో కుటుంబసభ్యులను ఫోన్లలో పలుకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంట్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉండే కొందరు సిబ్బంది వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి వస్తున్నారు. ఇంట్లోకి మాత్రం వెళ్లడంలేదు. కరోనా పోరులో కమిట్‌మెంట్‌తో సత్తా చాటుతున్నారు. వీరిలో ప్రధానంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని చిలకలగూడ, డబీర్‌పుర పోలీస్‌స్టేషన్లు, కామారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్ల సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. 

 హైదరాబాద్‌లో కొన్ని ఉదాహరణలు

  • చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బాలగంగిరెడ్డి, ఆ ఠాణా డీఐలు లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటినుంచి ఇంటికి వెళ్లలేదు. ఆ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఐదుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు, హోంగార్డులూ ఇంటిని చూడలేదు. వీరంతా గాంధీ దవాఖాన లోపల, దాని పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రైవేట్‌ హాస్టళ్లు, మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాళ్లలో ఆశ్రయం పొందుతున్నారు. పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే కొందరు సిబ్బంది లాక్‌డౌన్‌ ప్రారంభంలోనే తమ కుటుంబసభ్యులను సొంత గ్రామాలకు పంపించారు. 
  • డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కంటైన్మెంట్‌ ఏరియాల్లో విధులు నిర్వర్తిస్తున్నవారు షిఫ్ట్‌ పూర్తిగానే స్టేషన్‌కు వచ్చి ఆవరణలోనే స్నానాలు చేస్తున్నారు. ఆ తరువాత ఇంటికి వెళ్తున్నారు.

సంతోషం ఉన్నది

వికారాబాద్‌ జిల్లాల్లో కరోనా విజృంభించకుండా మేం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. లాక్‌డౌన్‌నుంచి నేను, మా సిబ్బంది చాలామంది ఇండ్లకు వెళ్లడం మానేశాం. కుటుంబసభ్యులు ఫోన్‌చేసినా కొన్నిసార్లు మాట్లాడలేని పరిస్థితి. ప్రజల క్షేమం కోసం కష్టపడుతున్నామన్న సంతోషం ఉంటున్నది. 

- నారాయణ, ఎస్పీ, వికారాబాద్‌

గది అద్దెకు తీసుకున్నాం

కొవిడ్‌-19 విధుల్లో ఉన్న మేం ఇంటికి వెళ్లకుండా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పద్మారావునగర్‌లో అద్దెకు ఒక గది తీసుకుని ఉంటున్నాం. నాతోపాటు మా స్టేషన్‌ డీఐ, ఎస్సైలు ఉంటున్నారు. కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతకాలం ఇండ్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం.  

- బాలగంగిరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌, చిలకలగూడ

విధుల్లోనే సంతృప్తి 

కరోనా కేసులు పెరిగినప్పటి నుంచి తీరిక లేదు. ఉన్నతాధికారుల సూచనలతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నాం. ఇంట్లో వాళ్లను సొంతూరికి పంపించా. మా అధికారులు, సిబ్బంది తీసుకున్న చర్యలతో మా జిల్లా పరిస్థితి మెరుగైంది. ఈ విపత్తులో ప్రజల ఆరోగ్యం కాపాడగల్గుతున్నామన్న సంతృప్తి ఎంతో ఉన్నది.

- శ్రీనివాస్‌, సీఐ, వికారాబాద్‌logo