ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 01:52:18

బీజేపీ నిర్వాకంపై పోలీసుల వీడియో సాక్ష్యం

బీజేపీ నిర్వాకంపై పోలీసుల వీడియో సాక్ష్యం

  • పరువు పాయే! 
  • అన్ని వివరాలు వెల్లడించినసిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌
  • సీజ్‌ చేసిన నగదును బీజేపీ నేతలు ఎత్తుకెళ్లారని వెల్లడి
  • అవాస్తవాలతో తప్పుడు ప్రచారం తగదంటూ హెచ్చరిక
  • సెర్చ్‌ నోటీసులు ఇచ్చాకే సోదాలు నిర్వహించామని స్పష్టీకరణ

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: సోదాల సాక్ష్యాలు బయటకువచ్చాయి.. పైసలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలిసింది.. ఎవరిచ్చారో తెలిసింది.. ఆ డబ్బును ఎవరు లాక్కెళ్లిపోయారో తెలిసింది.. ఒక్కదెబ్బకు బీజేపీ బండారం బయటపడింది. దుబ్బాక ఎన్నికల్లో ఓటర్లను లొంగదీసుకోవడానికి ఆ పార్టీ పన్నుతున్న పన్నాగాలన్నీ పటాపంచలయ్యాయి. పోలీసులపై మోపిన అంభాడాలు తుడిచిపెట్టుకుపోయాయి. సిద్దిపేట లెక్చరర్స్‌ కాలనీలోని రఘునందన్‌రావు బంధువు సురభి అంజన్‌రావు ఇంట్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకకాలంలో సోదాలు చేసి రూ.18.67 లక్షలు పట్టుకొన్న విషయం తెలిసిందే. ఈ డబ్బును పోలీసులే ఆ ఇంట్లో పెట్టారంటూ సోషల్‌ మీడియా, కొన్ని చానళ్లలో చూపారు. దీనిపై మంగళవారం సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసులపై తప్పుడు ప్రచారం చేయడం తగదు. ఇది పూర్తిగా అవాస్తవం. ఆ ఆరోపణలన్నీ సత్యదూరం’ అని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెచ్చిన డబ్బును రెయిడ్‌ చేసి పట్టుకొంటే, బీజేపీ నేతలు పోలీసులపైనే విరుచుకుపడి నగదును ఎత్తుకెళ్లిపోయారని జోయల్‌ డేవిస్‌ తెలిపారు. పైగా, పోలీసులే ఆ డబ్బును ఇంట్లో పెట్టారని అసత్య ప్రచారానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌, సిద్దిపేట ఏసీపీ నేతృత్వంలో పట్టణంలోని నాలుగు ఇండ్లలో సోదాలు జరిపామని తెలిపారు.

అందులో భాగంగానే దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు సురభి అంజన్‌రావు ఇంట్లో సోదాలకు ముందు సెర్చ్‌ నోటీసులు అందించామని వెల్లడించారు. సురభి అంజన్‌రావు ఇంట్లో అన్ని గదులను తనిఖీ చేసి, ఎక్కడెక్కడ ఏమేమి లభించాయో ప్రతీది లిఖితపూర్వకంగా అందజేశామని వివరించారు. సోదాల్లో రూ.18.67 లక్షలు పట్టుబడ్డాయని, కుటుంబసభ్యుల ఎదుటే పంచనామా నిర్వహించామని తెలిపారు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్‌లను సీపీ విడుదల చేశారు. నగదును ఇంట్లోంచి బయటకు తెస్తున్న క్రమంలో కొందరు బీజేపీ కార్యకర్తలు పోలీసులపై విరుచుకుపడి రూ.12.87 లక్షలు ఎత్తుకెళ్లారని ఆయన చెప్పారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణకు దిగారని అన్నారు. ఈ ఘటనలో 27 మందిపై కేసు నమోదు చేశామని, ఇప్పటికి ఏడుగురిని పేర్లతో గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వీడియో క్లిప్పింగ్‌ ద్వారా అందరినీ గుర్తించి కేసు నమోదు చేస్తామని చెప్పారు. డబ్బు పంపిన జితేందర్‌రావు, ఓటర్లకు పంచేందుకు ఇంట్లో దాచిన సురభి అంజన్‌రావుపై కేసు నమోదు చేశామని తెలిపారు. సీజ్‌ చేసిన నగదును ఎత్తుకెళ్లడం పెద్ద నేరమని, వీరిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయన్నారు.  

బండి సంజయ్‌ను గౌరవించాం 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను గౌరవించామని కమిషనర్‌ తెలిపారు. శాంతిభద్రతల దృష్టా సిద్దిపేటకు రావొద్దని ఆయనకు ముందే సూచించామని, అయినా సంజయ్‌ సిద్దిపేటకు వచ్చారని, గౌరవాన్ని కల్పించి, కారులో ఎక్కించి పంపామని వెల్లడించారు. ఏ సందర్భంలోనూ దురుసుగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక ప్రచారం కోసం వచ్చే ఎవ్వరినీ అడ్డుకోలేదని వెల్లడించారు. సమావేశంలో సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్‌ పాల్గొన్నారు. అటు.. తూతూమంత్రంగా చేపట్టిన దీక్షను బండి సంజయ్‌ విరమించారు.

బీజేపీ కార్యకర్తల నుంచి డబ్బు రికవరీ

బీజేపీ కార్యక్తలు ఎత్తుకెళ్లిన రూ.12.80 లక్షల్లో రూ.27,500 నగదును పోలీసులు రికవరీ చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం చేసినట్టు ఒప్పుకొన్నారు. ముగ్గురి వద్ద ఈ నగదును స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న నిందితులను కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

పోలీసులు విడుదల చేసిన వీడియోల సంభాషణలు ఇవీ..

సిద్దిపేటలోని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు సురభి అంజన్‌రావు ఇంట్లో పోలీసులు జరిపిన సోదాలకు సంబంధించిన వీడియోల్లో ఏమున్నదంటే..
వీడియో-1: గదిలోంచి సురభి 
అంజన్‌రావు భార్య కవర్‌లో డబ్బులు తీసుకొని వచ్చారు
పోలీసులు: కూర్చోండి. ఏం కాదు కూర్చోండి. ఇంకా ఏం లేవు కదా!
సురభి అంజన్‌రావు భార్య: 
ఏం లేవు సార్‌
వీడియో-2: సోదాల్లో పట్టుబడ్డ డబ్బును అంజన్‌రావు ఇంట్లోనే బెడ్‌పై పెట్టి లెక్కించారు. ఆ డబ్బును సురభి అంజన్‌రావు భార్యే ముట్టుకొన్నారు. ఇందులో మొత్తం రూ.15 లక్షలు ఉన్నట్టు నిర్ధారించారు.
పోలీసులు: ఈ డబ్బులు ఎందుకు తెచ్చారమ్మా?
సురభి అంజన్‌రావు భార్య: సార్‌ వస్తారు. నాకు తెల్వదు
పోలీసులు: మీకు తెలిసింది చెప్పండి
సురభి అంజన్‌రావు భార్య: నాకు బిజినెస్‌ ఏం తెల్వదండి
పోలీసులు: దేని కోసం తెచ్చారు?
సురభి అంజన్‌రావు భార్య: నేను అవన్నీ పట్టించుకోను
పోలీసులు: ఈ డబ్బు మీదేనా?
సురభి అంజన్‌రావు భార్య: మావే, మా సొంతమే.
పోలీసులు: మీ సారే తెచ్చారా?
సురభి అంజన్‌రావు భార్య: అవును, మా సారే తెచ్చిండ్రు. 
ఆ డబ్బును మళ్లీ ఆమె చేతులతోనే కవర్‌లో వేయించారు.
వీడియో-3: అంజన్‌రావును 
అధికారులు విచారించిన వీడియో ఇది.
పోలీసులు: డబ్బులు 
ఇచ్చింది ఎవరు?
సురభి అంజన్‌రావు: రఘునందన్‌ రావు బావమరిది జితేందర్‌రావు
పోలీసులు: డబ్బులు ఇచ్చిన అతను మీ బావమరిదా?
సురభి అంజన్‌రావు: అవును
పోలీసులు: సొంత బావమరిదా?
సురభి అంజన్‌రావు: కాదు, మా భార్య చిన్నబాపు కొడుకు
పోలీసులు: మీకెలా బంధుత్వం ఉంది?
సురభి అంజన్‌రావు: సురభి రామ్‌గోపాల్‌రావు, మాధవరావు మేమంతా కజిన్‌ బ్రదర్స్‌