శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 04:57:48

దేశానికే ఆదర్శం మన పోలీస్‌

దేశానికే ఆదర్శం మన పోలీస్‌

  • మహిళల భద్రతపై మరింత దృష్టి పెట్టాలి
  • వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం మోపాలి
  • కలప స్మగ్లింగ్‌పై సమన్వయంతో పనిచేయాలి
  • పోలీస్‌, అటవీశాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ.. శాంతిభద్రతల పరిరక్షణలోనూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తున్నదని చెప్పారు. సమాజాన్ని పీడించే గంజాయి రవాణాపై ఎక్సైజ్‌, అటవీశాఖల సమన్వయంతో పోలీసులు ఉక్కుపాదం మోపాలని, అటవీ సంపదను కొల్లగొట్టేవారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ పోలీసు, అటవీశాఖ ఉన్నతాధికారులతోసమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు కలప స్మగ్లింగ్‌ను సరిగా పట్టించుకోకపోవడం స్మగ్లర్లకు అలుసుగా మారిందని అన్నారు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం  ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నదని చెప్పారు. కలప స్మగ్లింగ్‌ను అరికట్టడంలో అటవీశాఖ అధికారులే కాకుండా సివిల్‌ పోలీసులు కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ద్వారా అడవులపై అవగాహన పెంచుకుని, స్మగ్లింగ్‌ వంటి అటవీనేరాలను అరికట్టడంలో పోలీసులు కృషిచేయాలని పిలుపునిచ్చారు.

గుడుంబాను తక్షణమే అరికట్టాలి

తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీసులు సాధించిన విజయాల్లో గుడుంబా నిర్మూలన కూడా ఒకటని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అయితే, కరోనా నేపథ్యంలో ఇటీవల మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ గుడుంబాను తయారుచేస్తున్నట్టు సమాచారమున్నదని తెలిపారు. దానిని తక్షణమే అరికట్టాలని సూచించారు. గతంలో రాష్ర్టాన్ని గుడుంబా రహితంగా మార్చిన స్ఫూర్తితో పనిచేయాలని అన్నారు. ఇందుకోసం ఎక్సైజ్‌శాఖతో పోలీసులు  సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలని కోరారు. ప్రజలను ఏమార్చే గ్యాంబ్లింగ్‌ వంటి సామాజిక దురాచారాలను అరికట్టడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కష్టపడి చదివి సాధించాల్సిన పట్టాలను అడ్డదారుల్లో పొందే సంస్కృతి సమాజానికి తప్పుడు సంకేతాలిస్తుందని సీఎం అన్నారు. నకిలీ సర్టిఫికెట్లను సృష్టించే ముఠాలు, వ్యక్తులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దళితులపై దాడులు బాధాకరం

దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగడం దారుణమని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బలహీనులపై బలవంతులు దాడులు చేయకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసు వ్యవస్థపై ఉన్నదన్నారు. చిన్నాపెద్ద తేడాలేకుండా పౌరులందరికీ  గౌరవాన్నిస్తూ ఫ్రెండ్లీ పోలీసు స్ఫూర్తిని పెంచుకోవాల్సిన అవసరం ప్రతి పోలీసుకు ఉన్నదని చెప్పారు. 

పది లక్షల సీసీకెమెరాల ఏర్పాటు లక్ష్యం

హైదరాబాద్‌లో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌.. డీజీపీ మహేందర్‌రెడ్డికి సూచించారు. నేరాలను అరికట్టడంలో సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలని చెప్పారు. దేశానికే తలమానికంగా హైదరాబాద్‌లో నిర్మాణమవుతున్న పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను అతి త్వరలో వినియోగంలోకి తీసుకొస్తామని సీఎం తెలిపారు. సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, అనురాగ్‌శర్మ, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగరావు, కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, పీసీసీఎఫ్‌ శోభ తదితరులు పాల్గొన్నారు.logo