గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 01:53:56

శామీర్‌పేట వద్ద రూ.40 లక్షలు పట్టుకున్న పోలీసులు

శామీర్‌పేట వద్ద రూ.40 లక్షలు  పట్టుకున్న పోలీసులు

  • బండారం బట్టబయలు
  • చెప్పేవి నీతులు.. చేసేవి దుర్మార్గాలు
  • ఆ సొమ్ము ఒక జాతీయ పార్టీదే?
  • అదుపులో నలుగురు, రెండు కార్లు
  • డబ్బు ఐటీ అధికారులకు అప్పగింత

శామీర్‌పేట్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఓ జాతీయపార్టీ దుబ్బాక ఉప ఎన్నికలో అక్రమాలకు తెరలేపిందా? అప్పుడే డబ్బులు పంచే కార్యక్రమం మొదలుపెట్టిందా? ముందస్తుగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారీగా డబ్బులు తరలిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిందా? సోమవారం శామీర్‌పేట్‌ టోల్‌ప్లాజా వద్ద రూ.40 లక్షలు పట్టుబడిన ఘటనపై జరుగుతున్న చర్చ ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. రెండు కార్లలో భారీగా హవాలా నగదును తరలిస్తున్నారంటూ మాదాపూర్‌ ఎస్వోటీ, శామీర్‌పేట పోలీసులకు సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు శామీర్‌పేట్‌ టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పటాన్‌చెరు నుంచి శామీర్‌పేట్‌ వైపు వస్తున్న రెండు కార్లు అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని ఆపి తనిఖీ చేయగా ముందు వస్తున్న కారులో రూ.40 లక్షలు బయటపడ్డాయి. ఆ కారులో నగదుతోపాటు ముగ్గురు ప్రయాణిస్తున్నారు. వారి వెనుక ఉన్న కారులో మరో వ్యక్తి అనుసరిస్తున్నారని తేలింది. దీంతో పోలీసులు వెంటనే రెండు కార్లను, 40 లక్షల నగదును శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ జరిపిన విచారణలో శ్రీనివాస్‌, మాజిద్‌, ఆంజనేయులు పటాన్‌చెరుకు చెందిన వారుగా, సురేశ్‌ హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులకు వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. డబ్బుకు సంబంధించిన ఆధారాలు, పత్రాలేవీ చూపలేకపోయారు. పటాన్‌చెరులో స్థలం అమ్మి సిద్దిపేటలో మరో స్థలం కొనడానికి తీసుకెళ్తున్నామంటూ బుకాయించారు. అది నిజమని నిరూపించే డాక్యుమెంట్లేవీ వారి వద్ద లేకపోవడంతో పోలీసులు రెట్టించి అడిగారు. కాగా, ఆ నలుగురు వ్యక్తులు ఓ జాతీయ పార్టీకి చెందిన కార్యకర్తలని అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ దిశగా ఇప్పటికే పోలీసులు లోతైన విచారణ ప్రారంభించారు. మరికొన్ని ఆధారాలు, అనుమానాలను నివృత్తి చేసుకున్న తర్వాత నగదు అసలు గుట్టు బయటపడనుంది. సైబరాబాద్‌ ఎస్వోటీ అదనపు డీసీపీ సందీప్‌, ఏసీపీ నరసింహారావు, ఇన్‌స్పెక్టర్‌ సంతోషంలు అనుమానితులను విచారించారు. ఆ కార్లు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయి ఉన్నాయో పరిశీలించి ఆ యజమానులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు. 

ఆ డబ్బులు బీజేపీవేనా?

శామీర్‌పేటలో దొరికిన రూ.40 లక్షలు బీజేపీవేనని, అవి దుబ్బాకకే తరలిస్తున్నారని సోమవారం సాయంత్రం సోషల్‌ మీడియా కోడై కూసింది. ఫేస్‌బుక్‌లోనూ, వాట్సాప్‌లోను ఈ విషయమై పెద్దఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. నిందితులు చెప్తున్నట్టు వారు సిద్దిపేటకు కాకుండా దుబ్బాకకే తరలిస్తున్నారని పలువురు సోషల్‌ మీడియా వేదికలపై చర్చించుకున్నారు. దుబ్బాకకు చెందిన నేతలే ఈ డబ్బును పురమాయించారని ఆరోపణలూ వెల్లువెత్తాయి. యావత్‌ దేశానికి నీతులు చెప్పే ఆ పార్టీ నేతలు ఎన్నికల విషయంలో దుర్మార్గపు పనులు చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విషయమై పోలీసులు విచారణ జరిపి నిజాలు వెల్లడించాల్సి ఉన్నది. 


logo