శనివారం 29 ఫిబ్రవరి 2020
స్పందించిన పోలీసులు.. నిలిచిన ప్రాణం!

స్పందించిన పోలీసులు.. నిలిచిన ప్రాణం!

Feb 14, 2020 , 01:53:52
PRINT
స్పందించిన పోలీసులు.. నిలిచిన ప్రాణం!
  • చనిపోతున్నానంటూ డయల్‌ 100కు బైక్‌ మెకానిక్‌ ఫోన్‌
  • మూడునిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
  • ఫ్యాన్‌కు వేలాడుతుండగా కాపాడి దవాఖానకు తరలింపు

గోల్నాక: తక్షణ స్పందనతో పోలీసులు ఓ ప్రాణాన్ని కాపాడారు. కేవలం మూడునిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకొని ఫ్యాన్‌కు వేలాడుతున్న వ్యక్తిని రక్షించిన ఘటన హైదరాబాద్‌ అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. ఇన్‌స్పెక్టర్‌ బీ మోహన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేటలోని చెన్నారెడ్డినగర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం (51) అలియాస్‌ సుబ్బుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. 


సుబ్బు బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీలో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు ఆస్ట్రేలియాలో ఉన్నతవిద్యను అభ్యసిస్తుండగా, చిన్న కుమారుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుబ్బు రూ.5 లక్షల వరకు అప్పుచేశాడు. అవి తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పుల వారి వేధింపులు భరించలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని గురువారం ఉదయం 9.54 నిమిషాల సమయంలో డయల్‌ 100కు కాల్‌చేసి చిరునామా కూడా చెప్పాడు. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. 


డీడీ కాలనీలోని మెకానిక్‌ షెడ్డులో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన అంబర్‌పేట పోలీసులు.. విషయాన్ని పెట్రోకార్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు వినోద్‌కుమార్‌, రఘుకుమార్‌కు చేరవేశారు. వారు కేవలం మూడు నిమిషాల్లోనే (ఉదయం 9.57 నిమిషాలకు) ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూసి ఉన్న మెకానిక్‌ షెడ్డును తెరిచి చూడగా.. అప్పటికే తాడుతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతున్న సుబ్బును కాపాడారు. కొనఊపిరితో  ఉండగా ప్రాథమిక చికిత్స అందించి.. ఆ తర్వాత 108లో దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ దవాఖానకు తరలించారు. వైద్య సేవల అనంతరం సుబ్బు  కోలుకున్నాడు. ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లను సీఐ బీ మోహన్‌కుమార్‌, ఎస్సైలు రవీందర్‌, మల్లేశం, సురేష్‌తోపాటు స్థానికులు అభినందించారు.


logo