శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 01:21:23

ప్రాణాలు నిలిపిన పోలీసులు

ప్రాణాలు నిలిపిన పోలీసులు
  • ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు సేఫ్‌

రామచంద్రాపురం/మంచిర్యాల టౌన్‌, నమస్తే తెలంగాణ: జీవితం మీద విరక్తితో తనువు చాలించాలనుకున్న ఇద్దరిని పోలీసులు కాపాడారు. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పీఎస్‌ పరిధిలోని మ్యాక్‌సొసైటీ ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో కానిస్టేబుల్‌ విఠలయ్య, హోమ్‌గార్డు అహ్మద్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో వారికి అక్కడ మద్యం సీసాలు, చెట్లపొదల్లో ఓ ద్విచక్రవాహనం కనిపించింది. సమీపంలోని రైలు పట్టాలపై ఓ వ్యక్తి మద్యం మత్తులో పడుకొని ఉన్నాడు. దీంతో పోలీసులు అతడిని లేపి ప్రశ్నించగా.. తన పేరు నగేశ్‌ అని తార్నాకలో ఉంటానని చెప్పాడు. తన భార్య గొడవపడి తల్లి దగ్గరికి వచ్చిందని, తీసుకెళ్లేందుకు వస్తే.. అత్తాభార్య తనతో గొడవకు దిగారని అన్నాడు. అందు కే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. 


పోలీసులు అతడిని కాపాడి భార్యాభర్తలకు సర్దిచెప్పి పంపించారు. మరో ఘటనలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం మారేడుపల్లికి చెందిన దమ్ముల ప్రశాంత్‌ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నాని తన అన్న రాజేశ్‌కు ఫోన్‌లోచెప్పాడు. వెంటనే రాజేశ్‌ 100కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. టౌన్‌ సీఐ లింగయ్య స్పందించి ఎస్సై చందర్‌తో శ్రీరాంపూర్‌ పెట్రోలింగ్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా జైపూర్‌లో అటవీప్రాంతంలో ప్రశాంత్‌ను గుర్తించిన పోలీసులుప్రశాంత్‌ను మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.


logo