ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 12:36:57

జవహర్‌నగర్‌ ఘటనలో పలువురిపై హత్యాయత్నం కేసు

జవహర్‌నగర్‌ ఘటనలో పలువురిపై హత్యాయత్నం కేసు

హైదరాబాద్‌: జవహర్‌నగర్‌ ఘటనలో పలువురిపై కేసు నమోదైంది. సీఐ భిక్షపతి, కానిస్టేబుల్‌ అరుణ్‌పై కిరోసిన్‌ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడిన విషయం తెలిసిందే. 

ఆక్రమణలను తొలగించడానికి వెళ్లిన మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసు అధికారులపై కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ భిక్షపతి, కానిస్టేబుల్‌ అరుణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో  ఆక్రమణదారులు పూనమ్‌ చంద్‌, నిహాల్‌ చంద్‌, శాంతిదేవి, నిర్మల్‌, బాల్‌సింగ్‌, చినరాం పటేల్‌, గీత, గోదావరి, యోగి కమల్‌, మదన్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేశారు. వీరితోపాటు స్థానిక నాయకులు శంకర్‌, శోభారెడ్డిపై కూడా కేసు రిజిస్టర్‌ చేశారు. ఈ ఘటనపై ఉప్పల్‌ సీఐ రంగస్వామి ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితామూర్తి దర్యాప్తును పర్యవేక్షించనున్నారు. 

భూ కబ్జాదారుల దాడిలో గాయపడిన సీఐ భిక్షపతిరావు, కానిస్టేబుల్‌ అరుణ్‌ సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఐసోలేషన్‌లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. భిక్షపతిరావు కాళ్లు, చేతులకు 45 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.