బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్దామనుకున్న ఓ వ్యక్తి.. వీసా కోసం తనకున్న ఎకరం భూమి అమ్ముకున్నాడు. కొనుగోలుదారుడి బంధువు స్నేహితుడి అకౌంట్ నుంచి తన అకౌంట్లోకి డబ్బులు జమకావడంతో సంతోషించాడు. ఇక విదేశానికి వెళ్లడమే తరువాయి అనుకున్నాడు. కానీ, ఊహించని విధంగా అకౌంట్ సీజ్ కావడంతోపాటు ఏ దేశానికీ వెళ్లలేని దుస్థితిలోకి జారిపోయాడు. సైబర్ కేసు పోతే గానీ, వీసా క్లియర్ కాదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయాడా వ్యక్తి!
ఓ కారు డ్రైవర్ పర్సంటేజీల పేరిట నమ్మించాడు. పదుల సంఖ్యలో అకౌంట్లు తీయించి, డెబిట్ కార్డులన్నీ తనదగ్గరే పెట్టుకున్నాడు. డబ్బులు వచ్చినప్పుడల్లా డ్రా చేస్తూ.. అందుకు కమీషన్ ఇస్తూ దందా నడిపాడు. తీరా సైబర్ అధికారుల విచారణతో గుట్టుగా గల్ఫ్ దేశానికి పారిపోయాడు. దాదాపు యాభై అకౌంట్ల ద్వారా రూ.ముప్పై కోట్ల లావాదేవీలను నిర్వహించినట్టు తెలియడంతో యువకులంతా లబోదిబోమంటున్నారు. ఆశకు పోయినందుకు తమ మెడకు ఉచ్చు బిగిస్తుందోనేమోనని ఆందోళన చెందుతున్నారు.
జగిత్యాల జిల్లాలో సైబర్ మోసాలు కలకలం రేపుతున్నాయి. అమాయకులను బుట్టలో వేసి నిండా ముంచుతున్నట్టు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు మోసగాళ్లు కమీషన్ల పేరిట స్థానిక యువకులకు ఎరవేస్తూ.. మరికొందరు విదేశాల నుంచి వ్యాపారం నిర్వహిస్తూ.. ఇంకొందరు తమకు నమ్మకస్తులను గ్రామాల నుంచి విదేశాలకు తీసుకెళ్లి, వారి అకౌంట్ల నుంచి హుండీ (హవాలా) దందా నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల రెండు పెద్ద కేసులు బహిర్గతం కాగా, పోలీస్‌శాఖ ఇప్పటికే విచారణ చేపట్టినట్టు తెలిసింది. కాగా, ఈ విషయమై సైబర్ క్రైం, పోలీస్‌శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే అనవసరంగా సైబర్ నేరాలతో పాటు ఇంటర్నేషనల్ క్రైమ్స్ల్లో సైతం ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
జగిత్యాల, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల రూరల్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఓ యువకుడు జీవనోపాధి కోసం విదేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అందుకయ్యే డబ్బుల కోసం తన భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించాడు. కొంత నగదు ఇచ్చిన కొనుగోలుదారుడు, మరి కొంత సొమ్మును విక్రేత బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు. దీనికి ఆ యువకుడు అంగీకరించాడు. విదేశంలో ఉంటున్న కొనుగోలుదారుడి సోదరుడు భూ విక్రేతకు ఫోన్ చేసి, తన స్నేహితుడి అకౌంట్ నుంచి డబ్బులు పంపిస్తున్నానని చెప్పాడు. కొద్దిపేపటికే తన బ్యాంకు అకౌంట్లోకి రూ.మూడు లక్షలు రావడంతో భూ విక్రయదారుడు ఆనందపడ్డాడు. తర్వాత దరఖాస్తు చేసుకున్న వీసా కోసం ఎదురుచూశాడు. తనతో పాటు దరఖాస్తు చేసుకున్న వారందరికీ వచ్చి తనకు రాకపోవడంతో ఆందోళన చెందాడు. అంతలోనే గతంలో మరో దేశానికి దరఖాస్తు చేసుకున్న వీసా రావడంతో సంబురపడ్డాడు. కానీ, వీసా స్టాంపింగ్ క్లియర్ కాకపోవడంతో నిరాశ చెందాడు. అనుమానం వచ్చి ఏం జరిగిందోనని ఆరా తీయగా.. తన బ్యాంకు అకౌంట్ సీజ్ అయినట్టు గుర్తించాడు. బ్యాంకు అధికారులను కలువగా, అకౌంట్‌పై సైబర్ క్రైమ్ కేసు నమోదైందని, అది పోతే తప్ప వీసా స్టాంపింగ్ కాదని చెప్పారు. సదరు వ్యక్తికి సైబర్ వింగ్ నుంచి కూడా కేసు నమోదైన విషయం ఫోన్ ద్వారా తెలిపారు. అప్పుడు లోతుగా పరిశీలిస్తే దిమ్మదిరిగే విషయాలు వెలుగు చూశాయి. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి సోదరుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించాడు. సదరు అకౌంట్దారుడిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ అమ్మాయి కేసు నమోదు చేసింది. తనకు విదేశాల్లో ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తానని నమ్మించి, రూ.8 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. ఆ నేపథ్యంలో అక్కడి సైబర్ క్రైమ్ అధికారులు విచారణ ప్రారంభించారు. సదరు ఉత్తరప్రదేశ్ వ్యక్తి అకౌంట్‌ను గుర్తించారు. ఆ వ్యక్తి ఒక్కరోజే 30 కోట్ల రూపాయలను దేశంలోని వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసినట్టు గుర్తించిన అధికారులు సైతం బిత్తరపోయారు. తర్వాత అన్ని అకౌంట్లను సీజ్ చేశారు.
గొల్లపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన కారు డ్రైవర్ ముప్పై నలభై మంది యువకుల పేరిట బ్యాంకు అకౌంట్లు తీసి, సైబర్ నేరానికి ఊతంగా నిలిచినట్టు సమాచారం. విషయం వెలుగులోకి వస్తుండంతో దాదాపు నెల క్రితమే గల్ఫ్ దేశానికి పారిపోయాడు. కారు డ్రైవర్‌గా పనిచేసే ఆ యువకుడు గొల్లపల్లి, జగిత్యాల, మల్యాల, వెల్గటూర్ మండలాల్లో యువకులతో పరిచయాలు పెంచుకున్నాడు. వారిని నమ్మించి, వారి పేరిట వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించాడు. ఖాతాల్లోకి వచ్చే డబ్బుకు రెండు నుంచి నాలుగు పర్సంటేజ్ ఇస్తానని ఆశ చూపాడు. ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి కదా అన్న నమ్మకంతో పెద్ద సంఖ్యలో యువకులు ఖాతాలు తెరువగా, వారి డెబిట్ కార్డులన్నింటినీ ఆ డ్రైవరే నిర్వహించాడు. డబ్బులు వచ్చిన అకౌంట్‌కు సంబంధించి ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసి తీసుకోవడం, వచ్చిన అమౌంట్లో రెండు నుంచి నాలుగు శాతం కమిషన్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఏడాది వరకు యథేచ్ఛగా దందా నడిచింది. అయితే నెల క్రితం మల్యాలకు చెందిన ఒక యువకుడి అకౌంట్‌ను సైబర్‌క్రైం అధికారులు గుర్తించి, సీజ్ చేయడంతోపాటు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ విషయం గొల్లపల్లి మండలానికి చెందిన సైబర్ నేరగాడికి తెలిసిపోయింది. దీంతో ఇక ఈ దందా ఎంతోకాలం దాచిపెట్టలేమని గుర్తించిన సదరు మాయగాడు, వీసాపై ఎడారి దేశానికి పారిపోయాడు. గత ఆదివారం విజయవాడకు చెందిన సైబర్ పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామానికి చేరుకొని విచారించారు. దాదాపు యాభై అకౌంట్ల ద్వారా రూ.ముప్పై కోట్ల లావాదేవీలను నిర్వహించినట్టు తెలిపారు. ఇంకా పరిశీలనలో ఉన్నాయని, ఎక్కువ మట్టుకు ఖాతాల్లో నుంచి కొల్లగొట్టిన డబ్బులేనని పోలీసులు చెప్పడంతో గ్రామస్తులతో పాటు యువకుడి కుటుంబ సభ్యులు విస్తుపోతున్నారు. వీరే కాదు, రాయికల్ మండలం నుంచి బతుకుదెరువు కోసం మయన్మార్ దేశానికి వెళ్లిన వ్యక్తులను అక్కడి వాళ్లు బంధించి, సైబర్ నేరాలు చేయించారని బాధితు లు, వారి కుటుంబసభ్యు లు చెబుతున్నారు.
సైబర్ క్రైం విషయం తెలిసి భూ విక్రేత బిత్తరపోయాడు. నిండా మునిగానని భావించి, భూమి కొన్న వ్యక్తిని కలిసి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం బయటకు పొక్కితే ఇబ్బందవుతుందని భావించిన భూమి కొనుగోలుదారుడు, రూ.3లక్షలు చెల్లిస్తామని, అలాగే సైబర్ క్రైమ్ నుంచి బయట పడేస్తామని హామీ ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిపై ఫిర్యాదు చేసిన అమ్మాయిని గుర్తించి, కేసు వాపస్ తీసుకోవాలని ఫోన్లో సంప్రదించాడు. రూ.5లక్షల వరకు ఆమెకు చెల్లించినట్టు తెలుస్తున్నది. అయితే మరో రూ.3 లక్షలు ఇచ్చే వరకు తాను ఫిర్యాదును వాపస్ తీసుకోనని అమ్మాయి చెప్పడం, అటు వైపు రూ.30 కోట్ల లావాదేవీలు నిర్వహించిన వ్యక్తి అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోవడంతో అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటు భూ విక్రేతకు సంబంధించి ఇజ్రాయిల్ వీసా గడువు ముగిసిపోవడంతో కొనుగోలుదారుడితోపాటు ఆయన సోదరుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, గ్రామంలోనే పంచాయితీ నిర్వహించినట్టు తెలిసింది. జిల్లా పోలీస్‌శాఖలో ముఖ్య బాధ్యతల్లో ఉన్న అదే గ్రామానికి చెందిన సిబ్బంది ఒకరు, పంచాయితీలో కీలక భూమిక పోషించి, అన్ని తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్టు సమాచారం. కాగా, ఈ విషయంపై సైబర్ క్రైం పోలీసులతోపాటు ఇతర నిఘా విభాగాల అధికారులు సైతం దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. డబ్బుల ట్రాన్స్ఫర్ వెనుక హుండీ (హవాలా) వ్యాపారం జరుగుతున్నదా..? లేక ఇంకా ఏదైనా ఉగ్రకుట్ర కోనం ఉన్నదా..? అన్న కోణాల్లో విచారణ చేపట్టినట్టు తెలిసింది. అదే గ్రామానికి చెందిన పలువురు యువకులు విదేశాలకు పెద్ద సంఖ్యలో వెళ్లడం, పెద్ద మొత్తంలో అకౌంట్లలోకి నెలనెలా డబ్బులు వస్తుండడంపైనా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.