శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 09:47:21

వేకువజామున ప్రయాణాలు తగ్గించుకోండి..

వేకువజామున ప్రయాణాలు తగ్గించుకోండి..

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా వేకువజామున పొగమంచు కురుస్తున్నది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఉదయపు ప్రయాణాలు తగ్గించుకోవాలని కోరుతున్నారు. ఎక్కువ వెలుతురు ఉన్న హెడ్‌లైట్ల వల్ల ఎదురుగా వచ్చే వాహనదారుడికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దీంతో ప్రమాదాలు జరిగే అకాశం ఉందన్నారు. 

రాత్రి, తెల్లవారుజామున వాహనదారులు వైపర్లు ఉపయోగించాలని సూచించారు. బ్రేక్‌ వేసేముందు ఒకసారి వెనుక నుంచి వస్తున్న వాహనాలను చూసుకోవాలన్నారు. హైవేలు, రోడ్లపైన వాహనాలు ఎట్టిపరిస్థితుల్లో నిలుపకూడదని, పార్కింగ్‌ చేయవద్దని తెలిపారు. వాహనంలో పెద్ద శబ్ధంతో పాటులు పెట్టుకోరాదని వెల్లడించారు. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు హారన్‌ కొడుతూ వెళ్లాలని సూచించారు. 

రాష్ట్రంలో కొన్ని రోజులుగా తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు ఎక్కుగా జరుగుతున్నాయి. దీనికి పొగమంచే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. నిన్న వికారాబాద్‌ జిల్లా ఇజ్రాచిట్టంపల్లి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు. దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.     


logo