బుధవారం 27 మే 2020
Telangana - May 01, 2020 , 01:44:27

పోలీస్‌ హెల్త్‌ ప్రొఫైల్‌

పోలీస్‌ హెల్త్‌ ప్రొఫైల్‌

  • వివరాలు ఆరోగ్యభద్రతకు లింక్‌
  • ఆరోగ్య పరిస్థితినిబట్టి డ్యూటీలు
  • ఇప్పటికే 25వేల మంది డాటా సేకరణ

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సిబ్బంది ఆరోగ్యంపై పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరి హెల్త్‌ప్రొఫైల్‌ రూపొందించాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది నుంచి వారి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి విధుల కేటాయింపు ఉండేలా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేకంగా అర్జీలు పెట్టుకోకుండానే వారి పరిస్థితిని అంచనా వేసి శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ వంటి కష్టంతో కూడిన విధులు కాకుండా మరేదైనా విభాగంలో వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. ఈ వివరాలను పోలీస్‌ పథకం ‘ఆరోగ్య భద్రత’కు లింక్‌ చేస్తారు. ఇప్పటికే ఆరోగ్య భద్రతను టీఎస్‌కాప్‌తో అనుసంధానించినందున సిబ్బంది ఆరోగ్య వివరాలు అరచేతిలో అందుబాటులో ఉండనున్నాయి. గురువారం వరకు 25వేల మంది సిబ్బంది ఆరోగ్య వివరాలు సేకరించినట్టు ఓ పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. ఈ నెల 3వ తేదీవరకు పూర్తి వివరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. వీటి ఆధారంగా హెల్త్‌క్యాంపులు, వారిలో ైస్థెర్యాన్ని నింపేలా కౌన్సెలింగ్‌ ఇచ్చే వీలుంటుందని వివరించారు.


logo