గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 22:49:04

‘ఆస్తులను డిజిటలైజేషన్ చేసిన ఘనత పోలీస్‌శాఖదే’

‘ఆస్తులను డిజిటలైజేషన్ చేసిన ఘనత పోలీస్‌శాఖదే’

హైదరాబాద్ : రాష్ట్రంలో శాఖాపరమైన భూములు, ఆస్తులను గుర్తించి వాటి  వివరాలను డాక్యుమెంటేషన్ చేయడంతోపాటు డిజిటలైజ్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వశాఖగా పోలీస్‌శాఖ ప్రత్యేకత సాధించింది. ప్రభుత్వ శాఖలకు చెందిన భూములన్నింటినీ సర్వేతోపాటు డాక్యుమెంటేషన్‌, డిజిటలైజేషన్‌ చేయాలని సీఎం ఆదేశించంతో ఈ ప్రక్రియను రికార్డు సమయంలో పూర్తి చేసి పోలీశాఖ ఆదర్శంగా నిలిచిందని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ పూర్తి సహకారం అందించిందని తెలిపారు. పోలీస్ శాఖ భూ వివరాల డాక్యుమెంట్ విడుదల సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలోని 55 యూనిట్లకు చెందిన పోలీస్ ఎస్టేట్ అధికారులకు డీజీపీ కార్యాలయంలో ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించారు.

అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్, ఐజీ సంజయ్ జైన్, ఏఐజీ వెంకటేశ్వర్లు, ట్రాక్ కు చెందిన డా. చంద్ర శేఖర్, పోలీస్ శాఖ రాష్ట్ర ఎస్టేట్ అధికారి, డీఎస్పీ ఏ వేణుగోపాల్, ఐ.టీ విభాగం డీ.ఎస్.పీ శ్రీనాద్, డీఎస్పీ గంగారాం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీస్ శాఖకు 7050 ఎకరాల 24 గుంటల భూములున్నట్లు నిర్ధారించామని వివరించారు. 167 పోలీస్ స్టేషన్లు, కార్యాలయాలు ప్రైవేట్ భవనాలలో ఉన్నాయని, మరో 42 స్థలాలు పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ భూములను కేటాయించిందని తెలిపారు.

 పట్టుదల, క్రమశిక్షణ, విశ్వసనీయత ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని పోలీస్ ఆస్తుల నిర్ధారణ, డాక్యుమెంటేషన్ ప్రక్రియ నిరూపించిందని, దేశంలోని పలుశాఖలకు మార్గ దర్శకంగా, ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. తక్కువ సమయంలో ప్రక్రియ పూర్తిచేసిన యూనిట్ కార్యాలయాల ఎస్టేట్ అధికారులకు ప్రత్యేక పురస్కారాలు అందిస్తున్నట్టు ప్రకటించారు. పోలీస్ శాఖకు చెందిన భవనాలను, పోలీస్ స్టేషన్లు,  కార్యాలయాల డిజిటల్ ఫొటోలను రిమోట్ సెన్సింగ్ సహాయంతో రూపొందించి త్వరలో పోలీస్ వెబ్ సైట్‌లో ఉంచుతామని వెల్లడించారు.  అధికారులు ఏ పనిలోనైనా ప్రజలను భాగస్వామ్యం చేస్తే విజయ వంతమవుతాయని రాష్ట్రంలో సీసీకెమెరాల ప్రాజెక్ట్ నిరూపించిందని తెలిపారు.

హైదరాబాద్‌లో ప్రజల భాగస్వామ్యంతో ఆరు లక్షలకు పైగా సీసీకెమెరాలను ఏర్పాటు చేశామని, చైనాలోని నగరాలను మినహాయిస్తే లండన్ తర్వాత అత్యధిక సీసీకెమెరాలున్న నగరంగా హైదరాబాద్ చరిత్రలో నిలిచిందని గుర్తుచేశారు. ఆస్తుల డిజిటలైస్ ద్వారా భూములు ఆక్రమణలకు గురికావని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పక్రియను విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖలో మొట్ట మొదటి సారిగా ఎస్టేట్ అధికారులను నియమించామని తెలిపారు. ఈ సందర్బంగా కార్యాలయాల నిర్వహణపై రూపొందించిన సార్టింగ్, సిస్టమాటిక్, స్టాండర్డైజెషన్, సెల్ఫ్ డిసిప్లీన్, షైనింగ్ విధానాలతో కూడిన ఫైవ్- ఎస్ సూత్రాలను ప్రతీ ఒక్క అధికారి పాటించాలని డీజీపీ వివరించారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన ఎస్టేట్ అధికారులకు డీజీపీ ప్రశంసా పత్రాల ప్రదానం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.