e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home క్రైమ్‌ రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌దందా

రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌దందా

రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌దందా
  • ఆర్‌ఎంపీలతో కుమ్మక్కై అక్రమాలు
  • ఒక్కోఇంజెక్షన్‌ 30వేల -35వేలకు విక్రయం
  • సూర్యాపేటలో మెడికల్‌ మాఫియా గుట్టురట్టు
  • పోలీసుల అదుపులో 11 మంది.. మరొకరు పరారీ
  • 30 ఇంజెక్షన్లు, కారు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం
  • హైదరాబాద్‌లో రెండుచోట్ల 10 ఇంజెక్షన్లు..

ఒకవైపు కరోనా ప్రాణాలను తోడేస్తుంటే.. కొన్ని దవాఖానాలు, సిబ్బంది రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల పేరిట బాధితులను జలగల్లా పీక్కు తింటున్నారు. ఒక్కో ఇంజెక్షన్లు రూ.30 వేల నుంచి రూ.35 వేలకు అమ్ముతూ సొమ్ము చేసుకొంటున్నారు. సూర్యాపేటలో 30, హైదరాబాద్‌లో రెండుచోట్ల 10 రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకొన్నారు.

సూర్యాపేట సిటీ/ఉస్మానియా యూనివర్సిటీ/శామీర్‌పేట, మే 17: కొవిడ్‌తో బాధితులు అల్లాడిపోతుంటే.. రోగుల ప్రాణాలు కాపాడాల్సిన మందులను పలు దవాఖానలు, సిబ్బంది బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కొవిడ్‌ చికిత్సలో కీలకంగా ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.30 వేల నుంచి 35 వేల వరకు అమ్ముతూ రోగుల ప్రాణాలతో ఆటలాడుకొంటున్నారు. సోమవారం సూర్యాపేటలో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను సీసీఎస్‌, సూర్యాపేట పట్టణ పోలీసులు దాడిచేసి పట్టుకొన్నారు. వారినుంచి 30 ఇంజెక్షన్లను స్వాధీనంచేసుకొన్నారు. సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని ఆరెంజ్‌, సంజీవిని దవాఖానల మేనేజర్లు నరేశ్‌, నర్సింహరాజు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే సమాచారంతో సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఆత్మకూర్‌(ఎస్‌)కు చెందిన ఆర్‌ఎంపీ మాధవరెడ్డి, పందిరి కార్తీక్‌రెడ్డి, పెన్‌పహాడ్‌ మండలం భక్తలాపురంనకు చెందిన గోపాల్‌దాస్‌ పవన్‌కల్యాణ్‌, గోపాల్‌దాస్‌ సాయి, నడిగూడెం మండలం రత్నపురానికి చెందిన జల్లి సైదాబాబు అలియాస్‌ మనోహర్‌, నిమ్మలపంగ రమేశ్‌, కర్నూలు జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన సుగునావత్‌ వినోద్‌కుమార్‌నాయక్‌, నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చెనిమినేనిపల్లికి చెందిన మద్దిమడుగు రమేశ్‌, త్రిపురారం మండలం పలుగుతండాకు చెందిన రంగ, సూర్యాపేటకు చెందిన మద్దెల నర్సింహరాజు, నూతనకల్‌ మండలం మాచినపల్లికి చెందిన నిమ్మనగోటి శ్రీను బ్లాక్‌ దందాకు పాల్పడుతున్నట్టు తేలింది. వీరంతా సూర్యాపేట శివారులోని సెవెన్‌ స్టార్‌ హోటల్‌లో గదులను అద్దెకు తీసుకొని ఇంజెక్షన్లను అమ్ముతున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకోగా గోపాల్‌దాస్‌సాయి పరారీలో ఉన్నాడు. వారినుంచి 30 రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, ఒక కారు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామాల్లోని ఆర్‌ఎంపీల ద్వారా రోగులను గుర్తించి విక్రయిస్తున్నట్టు చెప్పారు.

హైదరాబాద్‌లో రెండుచోట్ల

హైదరాబాద్‌లో రెండుప్రాంతాల్లో బ్లాక్‌లో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ముగ్గురిని ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్‌నగర్‌ పోలీసులు వేర్వేరుగా అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. వారినుంచి 10 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యానగర్‌లో నివాసముండే రాహుల్‌ రాజ్‌ మొబైల్‌ షాప్‌లో పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు ఇంజెక్షన్‌ కావాలంటూ వలపన్ని తార్నాకలోని యాక్సిస్‌ బ్యాంకు వద్ద అతడ్ని అదుపులోకి తీసుకొన్నారు. ఆరు ఇంజెక్షన్లు, బైక్‌, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. కాప్రా మండలం భరత్‌నగర్‌కు చెందిన తేలు సునీల్‌కుమార్‌, శివసాయినగర్‌కు చెందిన వంశీ బ్లాక్‌లో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను విక్రయిస్తున్నారు. సమాచారం అందుకొన్న మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని 4 ఇంజెక్షన్లు, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌దందా

ట్రెండింగ్‌

Advertisement