మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 01:30:11

పోలవరం పెంపుతో తెలంగాణకు నష్టమే

పోలవరం పెంపుతో తెలంగాణకు నష్టమే

  • బ్యాక్‌వాటర్‌తో భద్రాద్రికి ముంపు ముప్పు
  • మణుగూరు భారజల విద్యుత్‌ కేంద్రానికీ ప్రమాదం
  • ఐటీసీ కాగిత పరిశ్రమ, సీతారామ ప్రాజెక్టుపై వరద ప్రభావం
  • 50 లక్షల క్యూసెక్కుల పీఎంఎఫ్‌ అంచనాతో నిర్మాణం 
  • పోలవరం అథారిటీ సీఈవోకు తెలంగాణ ఈఎన్సీ లేఖ 
  • ముంపు నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని వినతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీ ప్రభుత్వం నిర్మించే పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి, మణుగూరు భారజల విద్యుత్‌ కేంద్రానికీ ప్రమాదం పొంచి ఉన్నదని రాష్ట్ర ఈఎన్సీ సీ మురళీధర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. బ్యాక్‌వాటర్‌తో కలిగే ముంపు విస్తీర్ణంపై మరోసారి సర్వేచేసి, నివారణకు రక్షణ చర్యలు చేపట్టాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరారు. జాతీయ హోదా పొందిన పోలవరం ప్రాజెక్టును ముందుగా అనుకున్న 36 లక్షలకు మించి 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిర్మిస్తున్నందున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ముంపు ప్రభావం, తెలంగాణకు కలుగుతున్న నష్టాలను, ఆందోళనలను వివరిస్తూ అథారిటీ సీఈవోకు ఆయన లేఖ రాశారు. 

ప్రాజెక్టుకు 1980లో అనుమతులు తీసుకున్నప్పుడు గరిష్ఠ వరద ప్రవాహం(పీఎంఎఫ్‌) 36 లక్షల క్యూసెక్కులుగా అంచనా వేశారని, ప్రాజెక్టు ఎత్తును 140 మీటర్లకు పరిమితం చేశారని గుర్తుచేశారు. 2009లో కేంద్ర జలసంఘం 50 లక్షల క్యూసెక్కుల పీఎంఎఫ్‌తో నిర్మాణానికి అనుమతినిచ్చిందన్నారు. ఈ మేరకు డిజైన్‌, నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. పీఎంఎఫ్‌ పెరుగడంతో బ్యాక్‌వాటర్‌ వల్ల ముంపు విస్తీర్ణం పెరుగుతున్నదన్నారు. గతంలో 32 లక్షల క్యూసెక్కుల పీఎంఎఫ్‌కు మాత్రమే అధ్యయనం చేశారని, ఈ పరిధిలోకి వచ్చే 371 గ్రామాలను రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కలుపుకొన్నారని గుర్తుచేశారు. 50 లక్షల క్యూసెక్కుల వల్ల కలిగే నష్టంపై తాము హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులతో అధ్యయనం చేయించామన్నారు.

ఈ నివేదిక ప్రకారం ప్రాజెక్టుకు 32 లక్షల క్యూసెక్కుల వరద వస్తే తెలంగాణలోని 184.79 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ముంపు పొంచి ఉన్నదని, ఇందులో 72 గ్రామాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకవేళ 50 లక్షల క్యూసెక్కులు వస్తే  జిల్లాలోని చర్ల వరకు వరద పోటెత్తి 94 గ్రామాలకు ముంపు తప్పదని హెచ్చరించారని ఈఎన్సీ వెల్లడించారు. మణుగూరులోని భారజల కర్మాగారం, సారపాకలోని ఐటీసీ కాగిత పరిశ్రమ, సీతారామ ప్రాజెక్టులపై వరద ప్రభావం ఉంటుందని తేలిందని తెలిపారు.

భద్రాచలం వద్ద 62.17 మీటర్ల ఎత్తున నీళ్లు!

ప్రధానంగా భద్రాచలం పట్టణం వద్ద బ్యాక్‌వాటర్‌ 62.17 మీటర్ల ఎత్తున నిలుస్తాయని, దుమ్ముగూడెం వద్ద 65.31 మీటర్ల మేర నిలుస్తాయని హైదరాబాద్‌ ఐఐటీ తేల్చిందన్నారు. దీంతో మణుగూరు భార జల విద్యుత్‌ కేంద్రం కూడా ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. 32 లక్షల క్యూసెక్కుల అంచనాలతో పోల్చితే ఇది 3-6 మీటర్లు అదనమన్నారు. ఏపీకి చెందిన ఎస్‌ఈసీవో సంస్థ చేసిన అధ్యయనంలోనూ 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే బ్యాక్‌ వాటర్‌ వల్ల భద్రాచలం వద్ద 60.39 మీటర్ల ఎత్తున, దుమ్ముగూడెంలో 65.22 మీటర్ల ఎత్తున నీరు నిలుస్తాయని తేలిందన్నారు. 

ఈ విషయాన్ని తాము సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. 2009లో శ్రీశైలానికి భారీ వరద వచ్చిన నేపథ్యంలో అప్పటి ఉమ్మడి పాలకులు జలాశయాన్ని నింపాలనే ఉద్దేశంతో దిగువకు నీరు విడుదల చేయలేదన్నారు. దీంతో బ్యాక్‌వాటర్‌తో కర్నూలు నగరం ముంపునకు గురైన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే పరిస్థితి పోలవరానికి ఎదురైతే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని, ప్రజలకు ఆస్తి, ప్రాణనష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని బ్యాక్‌వాటర్‌ ముంపుపై మరోసారి సర్వే చేయించాలని కోరారు.