బుధవారం 27 మే 2020
Telangana - May 08, 2020 , 02:06:51

విషం విరజిమ్ముతున్న పరిశ్రమలు

విషం విరజిమ్ముతున్న పరిశ్రమలు

  • నిర్లక్ష్యానికి భారీ మూల్యం
  • కార్మికులు, సాధారణ జనం బలి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పరిశ్రమలనుంచి వెలువడే విషవాయువులు ప్రాణాలను హరించడంతోపాటు పర్యావరణానికి కూడా తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా వాటిలో పనిచేసే కార్మికులతోపాటు సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. పనిప్రదేశాల్లో నిర్లక్ష్యం, మార్గదర్శకాలను పాటించకపోవటం తదితర కారణాలవల్ల తరుచుగా ఎక్కడో ఒక చోట ఈ తరహా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో 36 ఏండ్ల క్రితం జరిగిన భోపాల్‌ దుర్ఘటనను విశాఖలో జరిగిన ైస్టెరిన్‌ గ్యాస్‌ లీక్‌ ఘటన మరోమారు గుర్తుచేసింది.

  బాంబే డాక్స్‌ పేలుడు  

ముంబైలోని విక్టోరియా డాక్‌లో 1944, ఏప్రిల్‌ 14న భారీ పేలుడు సంభవించింది. 1400 టన్నుల పేలుడు పదార్థాలు, పత్తి బేళ్లు, బంగారాన్ని రవాణా చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విష వాయువులతోపాటు ఆ ప్రాంతమంతా మంటలు కూడా వ్యాపించాయి. వెయ్యిమందికిపైగా ఈ దుర్ఘటనలో మరణించారు. 12 కిలోమీటర్ల మేర విస్తరించిన మంటలవల్ల 80వేల మంది నిరాశ్రయులయ్యారు. 

  చాస్నాలా గని విపత్తు  

1975, డిసెంబర్‌ 27న బీహార్‌లోని ధన్‌బాద్‌లో చాస్నా బొగ్గుగనిలో జరిగిన దుర్ఘటనలో 372 మంది చనిపోయారు. మీథేన్‌ గ్యాస్‌ విడుదలవటం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో గనిలో చిక్కుకుపోయిన వారు మృత్యువాతపడ్డారు.

  భోపాల్‌ పీడకల  

భోపాల్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ సంస్థలో 1984లో జరిగిన దుర్ఘటన దేశ చరిత్రలో మాయనిమచ్చగా మిగిలిపోయింది. ఎరువుల ప్లాంట్‌ నుంచి విషవాయువులు విడుదలై 5,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచలోనే అత్యంత దారుణమైన పారిశ్రామిక విపత్తుల్లో ఒకటిగా ఇది నిలిచింది. దాదాపు 36 ఏండ్ల తర్వాత కూడా ఆ విషవాయువు ప్రభావం ఇంకా కొనసాగుతున్నది. ఎంతోమంది దివ్యాంగులుగా జన్మిస్తున్నారు. 

  విశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ బ్లాస్ట్ ‌

విశాఖలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో 2013 ఆగస్టు 23న జరిగిన పేలుడులో 23 మంది మృతిచెందారు. పైప్‌లైన్‌ నుంచి వాయువు లీక్‌ కావడంవల్ల భారీఎత్తున మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగింది. 

  నాగారం గెయిల్‌ పైప్‌లైన్‌ బ్లాస్ట్  ‌

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా నాగారం వద్ద 2014 జూన్‌ 27న గెయిల్‌ పైప్‌లైన్‌ పేలింది. పేలుడు ధాటికి నేలపై పెద్ద గొయ్యి ఏర్పడటంతోపాటు చుట్టుపక్కలకు మంటలు విస్తరించి కొబ్బరిచెట్లు, వాహనాలు, ఇండ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 18 మంది మరణించగా, 40 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. 

  భిలాయ్‌ స్టీల్‌ప్లాంట్‌ గ్యాస్‌ లీక్ ‌

ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్‌ జిల్లాలోని భిలాయ్‌ స్టీల్‌ప్లాంట్‌ నుంచి మీథేన్‌గ్యాస్‌ లీకైంది. 2014లో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మందికిపైగా అనారోగ్యం పాలయ్యారు. అదే స్టీల్‌ప్లాంట్‌లో 2018లో జరిగిన పేలుళ్ల వల్ల 9 మంది చనిపోగా, 20 మందిదాకా గాయపడ్డారు.


logo